మైనంపల్లి టికెట్‌ చేజార్చుకోబోతున్నారా?

August 21, 2023


img

ఈరోజు సిఎం కేసీఆర్‌ ప్రకటించిన తొలి బిఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి మళ్ళీ మైనంపల్లి హన్మంతరావుకే సీటు కేటాయించారు. అయితే ఆయన ఈరోజు ఉదయమే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు తొందరపాటుతో మంత్రి హరీష్‌ రావుని ఉద్దేశ్యించి చులకనగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. 

“మా ఎమ్మెల్యేలలో ఒకరు (మైనంపల్లి హన్మంతరావు) తనతో పాటు తన కుటుంబ సభ్యులలో మరొకరికి టికెట్‌ ఇవ్వాలని కోరారు. కానీ ఇవ్వకపోవడంతో ఆయన ఆవేశంతో మంత్రి హరీష్‌ రావుని ఉద్దేశ్యించి చులకనగా మాట్లాడారు. ఆయన అసభ్య ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మేమందరం మంత్రి హరీష్‌ రావుకు అండగా ఉన్నామని తెలియజేస్తున్నాను. ఆయన పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఆయన అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ పార్టీకి మూలస్తంభం వంటివారే,” అని ట్వీట్‌ చేశారు. 

ఇంతకీ మైనంపల్లి ఏమన్నారంటే, “ట్రంకు పెట్టె, రబ్బరు చెప్పులు వేసుకొని వచ్చిన హరీష్‌ రావుకి లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? మెదక్ జిల్లాలో ఆయన బోడి పెత్తనం బాగా ఎక్కువైపోయింది. హరీష్‌ రావు చాలామందిని రాజకీయంగా అణచివేశారు. కానీ నేను ఆయన చేత బట్టలిప్పించి పరిగెత్తించగలను. నా కెపాసిటీ ఏమిటో ఆయనకు వచ్చే ఎన్నికలలో తప్పకుండా తెలియజేస్తాను. ఎవరు అవునన్నా కాదన్నా నేను మళ్ళీ మల్కాజిగిరి నుంచి, మా అబ్బాయి డాక్టర్ రోహిత్ మెదక్ నుంచి తప్పక పోటీ చేస్తాము. తప్పకుండా గెలుస్తాము. ఈ తిరుమల శ్రీవారి సాక్షిగా నేను ఈ మాటలు చెపుతున్నాను,” అని అన్నారు. 

మంత్రి హరీష్‌ రావుని మాత్రమే ఉద్దేశ్యించి మైనంపల్లి ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేసిన్నట్లనిపిస్తున్నప్పటికీ, కేసీఆర్‌ కుటుంబంలో అందరినీ ఉద్దేశ్యించే అన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ తన కొడుకు కూడా కేసీఆర్‌ టికెట్‌ ఇవ్వకపోతే మైనంపల్లి, తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందే మాట్లాడుకొన్నారు కనుకనే పార్టీలో కీలకమైన మంత్రి హరీష్‌ రావుని ఉద్దేశ్యించి ఇంత చులకనగా మాట్లాడి ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక బిఆర్ఎస్ పార్టీ ఆయన స్థానంలో మరొకరిని అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉంది.     




Related Post