ఈరోజు సిఎం కేసీఆర్ శాసనసభలో 119 స్థానాలకు 115 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించడంతో కమ్యూనిస్టులతో పొత్తులు మునుగోడు వరకే అని చెప్పకనే చెప్పిన్నట్లయింది. మునుగోడు ఎన్నికలప్పుడు తమ బందం మున్ముందు కూడా సాగుతుందని వామపక్ష నేతలు చెప్పుకొన్నారు. కానీ కేసీఆర్ ఏనాడూ చెప్పలేదు. కనీసం పొత్తులు సీట్ల సర్దుబాట్ల గురించి వారితో చర్చించలేదు. ఏకపక్షంగా బిఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించేశారు.
వామపక్షాలు ఆయనను తప్పు పట్టలేవు కనుక ఇక తమదారి తాము చూసుకోవలసిందే. ఈసారి శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ చాలా పట్టుదలగా ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలతో పొత్తులకు సిద్దపడవచ్చు.
అయితే సీపీఐ, సీపీఎంలకు ప్రధానంగా ఖమ్మం, మహబూబ్‌నగర్‌లోనే మంచి పట్టు ఉంది. ఆ రెండు జిల్లాల నుంచే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ వారికి, వారు అనుచరులకు టికెట్స్ లభిస్తాయనే హామీతోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు కనుక వామపక్షాలతో పొత్తులు పెట్టుకోవాలంటే ముందుగా వారిద్దరినీ ఒప్పించాల్సి ఉంటుంది. ఒకవేళ వారు అంగీకరించకపోతే వామపక్షాలు ఒంటరిగానే పోటీ చేయాల్సి ఉంటుంది.