నన్ను మోసం చేశావుగా పల్లా... ముత్తిరెడ్డి కన్నీళ్ళు

August 19, 2023


img

జనగామ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈసారి తనకు టికెట్‌ లభించదని గ్రహించిన్నట్లే ఉన్నారు. ఆయన అనుచరులు జనగామ పట్టణంలో రోడ్లపై ఆందోళనలు చేస్తుంటే, ఆయన విలేఖరుల ముందు కన్నీళ్ళు పెట్టుకొని విలపిస్తున్నారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, “నా ఇంట్లో చిచ్చు పెట్టి నా కూతురిని నాకు శత్రువుగా మార్చి నన్ను దెబ్బతీశావు. నియోజకవర్గంలో బిఆర్ఎస్ కార్యకర్తలకు డబ్బులిచ్చి నీవైపు తిప్పుకొన్నావు. నీ కాలేజీ కుర్రాళ్ళతో దొంగ సర్వేలు చేయించుకొని పేపర్లలో వేయించుకొన్నావు. 

హైదరాబాద్‌లో కూర్చొని నాకు వ్యతిరేకంగా కేసీఆర్‌, కేటీఆర్‌లకు పిర్యాదులు చేసి వారికి నాపై వ్యతిరేకత కలిగేలా చేశావు. కేసీఆర్‌ వెంట నేను 22 ఏళ్ళున్నాను. కానీ నువ్వు నాకు వ్యతిరేకంగా కుట్రలు చేయడం తప్ప తెలంగాణ కోసం, బిఆర్ఎస్ పార్టీ కోసం, జనగామ నియోజకవర్గం కోసం ఏమి చేశావో చెప్పగలవా?

నేను ఈ సందర్భంగా కేసీఆర్‌, కేటీఆర్‌కు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మొదటి నుంచి మీ అడుగుజాడలలో మీకు విధేయంగా ఉంటూ పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతగానో కష్టపడ్డాను. మీ నాయకత్వంలో జనగామను ఎంతగానో అభివృద్ధి చేశాను. కనుక పల్లా వంటి నేతల చెప్పుడు మాటలు విని నాకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ నాకు టికెట్‌ ఇస్తే నేను గెలిచి జనగామను మీకు కానుకగా అందిస్తాను,” అని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీడియా ద్వారా కేసీఆర్‌, కేటీఆర్‌లను వేడుకొన్నారు. కానీ ఇంతకాలం ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని కన్నీళ్ళు కార్చినా ఏం ప్రయోజనం?ఇతరులను నిందించి ఏం ప్రయోజనం?ఈ ఆలోచన, ఈ భయం ముందు నుంచే ఉంటే నేడు ఇలా విలపించాల్సిన అవసరం ఉండేది కాదు కదా?


Related Post