త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలకు అభ్యర్ధుల తొలిజాబితాను సిఎం కేసీఆర్ స్వయంగా సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ప్రకటించబోతున్నట్లు తాజా సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 90 శాతం మందికి మళ్ళీ టికెట్స్ ఇస్తామని కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. అయితే మిగిలిన ఆ 10 శాతంలో తమ పేర్లు ఉండవచ్చని కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
వారిలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలు కూడా ఉన్నారు. ఇంతకాలం తమకే మళ్ళీ టికెట్స్ వస్తాయని వీరిద్దరూ ధీమా వ్యక్తం చేసేవారు. కానీ రాజయ్య జానకీపురం మహిళా సర్పంచ్‌ని లైంగికంగా వేదించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, కడియం శ్రీహరితో తరచూ ఘర్షణ పడుతూ ప్రెస్‌మీట్‌లు పెట్టి పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడుతుండటం కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించింది.
కనుక ఈసారి రాజయ్యను పక్కన పెట్టి కడియం శ్రీహరికి టికెట్ ఖరారు చేసిన్నట్లు జోరుగా వార్తలు వస్తుండటంతో ఆయన తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇందుకు నిదర్శనంగా రాజయ్య అనుచరులు ఇవాళ్ళ ఉదయం నుంచి రోడ్లపైకి వచ్చి కడియం శ్రీహరి గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తుండటమే.
రాజయ్య తన అనుచరుల చేత ఈవిదంగా చేయించి పార్టీ కేసీఆర్, కేటీఆర్ మీద టికెట్ కోసం ఒత్తిడి చేయాలనుకొంటున్నారు కానీ ఇటువంటి దుందుడుకు చర్యలే వారికి మరింత ఆగ్రహం తెప్పిస్తాయని గ్రహించిన్నట్లు లేదు.
ఇక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా భూకబ్జాలకు పాల్పడిన్నట్లు ఆయన సొంత కూతురే ఫిర్యాదు చేసి, తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించిన ప్రభుత్వ భూమిని తిరిగి మునిసిపల్ అధికారులకు అప్పగించేశారు. ముత్తిరెడ్డి ప్రవర్తన, వ్యవహారశైలిపై కూడా జనగామలో బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేస్తున్నారు.
కనుక సిఎం కేసీఆర్ ఈసారి ముత్తిరెడ్డిని పక్కన పెట్టేసి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఖరారు చేసిన్నట్లు వార్తలు వస్తుండటంతో ఆయన కూడా తీవ్ర ఆందోళనతో ఉన్నారు. జనగామలో ఆయన అనుచరులు కూడా రోడ్లపైకి వచ్చి బైటాయించి పల్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
బిఆర్ఎస్ పార్టీలో వివాదాలలో చిక్కుకొని పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నవారు మరికొందరు ఎమ్మెల్యేలున్నారు. వారు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే కేసీఆర్ మొదటి నుంచి అందరికీ హితవు చెపుతూనే ఉన్నారు. కానీ చెవికెక్కించుకోకుండా ఇప్పుడు ఆందోళన చెంది ఏం ప్రయోజనం?