తెల్లం వెంకట్రావు మళ్ళీ బిఆర్ఎస్‌ గూటికే

August 17, 2023


img

భద్రాచలంలో బిఆర్ఎస్‌ సీనియర్ నాయకుడు తెల్లం వెంకట్రావు ఇటీవలే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయన గత ఎన్నికలలో భద్రాచలం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్ధి పోదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. పొంగులేటి మాట నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో చేరగా భద్రాచలం టికెట్‌ ఇవ్వలేమని, అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యే మళ్ళీ పోటీ చేస్తారని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెప్పడంతో తీవ్ర నిరాశ చెందారు. 

ఈసారి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో బిఆర్ఎస్‌కు గట్టి పోటీ ఉండబోతోంది. కనుక అన్ని నియోజకవర్గాలలో బలమైన అభ్యర్ధులు తప్పనిసరి. ఈ నేపధ్యంలో తెల్లం వెంకట్రావుకు కాంగ్రెస్‌ టికెట్‌ నిరాకరించిన్నట్లు తెలియడంతో సిఎం కేసీఆర్‌ సూచన మేరకు మంత్రి హరీష్‌ రావు ఆయనతో మాట్లాడి బిఆర్ఎస్‌ పార్టీలోకి వచ్చేస్తే మళ్ళీ భద్రాచలం నుంచి పోటీ చేయవచ్చని నచ్చజెప్పారు. 

ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ పుంజుకొని ఈసారి ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నందున, ఆ పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటే లాభపడతాననుకొని తెల్లం వెంకట్రావు భావించారు. కానీ ఆ పార్టీలో టికెట్‌ లభించనప్పుడు దానిలో ఉండి ఏం ప్రయోజనం?భద్రాచలం నుంచి మళ్ళీ పోటీ చేసేందుకు అవకాశం ఇస్తున్న బిఆర్ఎస్‌ పార్టీలో చేరి అదృష్టం పరీక్షించుకోవడమే మంచిది కదా?అని భావించి బిఆర్ఎస్‌లోకి తిరిగి వచ్చేందుకు అంగీకరించారు. కనుక నేడో రేపో ఆయన మళ్ళీ గులాబీ కండువా కప్పుకొని కారు ఎక్కేందుకు సిద్దంగా ఉన్నారు.


Related Post