వైఎస్ షర్మిల ఈరోజు హైదరాబాద్‌లో లోటస్ పాండ్ నివాసంలో జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సిఎం కేసీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “ఆనాడు మనదేశాన్ని తెల్లదొరలు దోచుకొనేవారు. ఇప్పుడు నల్లదొర (కేసీఆర్) తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొంటున్నారు. తెల్లదొరలకు ఉండే అహంకారం, నియంతృత్వ పోకడలు అన్ని కేసీఆర్‌కి కూడా ఉన్నాయి.
ఆనాడు తెల్లదొరలు మనల్ని మోసం చేసిన్నట్లే ఈ నల్లదొర కేసీఆర్ కూడా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మోసం చేస్తున్నారు. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ ఒక్క హామీనైనా నిలబెట్టుకొన్నారా? కేసీఆర్‌ని గద్దె దించితేనే తెలంగాణ రాష్ట్రానికి నిజమైన స్వాతంత్రం వస్తుంది,” అని తీవ్ర విమర్శలు చేశారు.
వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు ఇక్కడ తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీలో చోటు లేదని ఆమె ఏపీకి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగానే చెప్పారు. కానీ ఏపీని పాలిస్తున్నది ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డి కావడంతో ఏపీలో అడుగుపెడితే అతనితో యుద్ధం చేయవలసి వస్తుందనే ఆలోచనతో ఆమె ఏపీకి వెళ్ళేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఇక్కడ తెలంగాణలో ఆమెకు చోటు లేదు. ఏపీకి వెళ్ళే అవకాశం లేదు. కనుక ప్రస్తుతం ఆమె రాజకీయ చౌరస్తాలో నిలబడి ఎటుపోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిలో కూడా ఆమె తెలంగాణ సిఎం కేసీఆర్‌పై ఇటువంటి విమర్శలు చేయడం చాలా ఎబ్బెట్టుగా ఉంది.