మరో 3-4 నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు భారీగా వరాలు ప్రకటిస్తోంది. అవన్నీ పాక్షికంగా అమలుచేయాలన్నా వేలకోట్లు అత్యవసరంగా కావాలి. అయితే ఇప్పటికిప్పుడు అంత డబ్బు పుట్టించడం చాలా కష్టం.
కనుక హైదరాబాద్‌లో కోకాపేట, బుద్వేల్ లో భూములు వేలంపాట ద్వారా కొంత సొమ్ము సమకూర్చుకొంది. ఇప్పుడు మోకిల ఫేజ్-2లో 300 ఇళ్ళ స్థలాలను వేలానికి పెట్టింది. ఈ మేరకు హెచ్ఎండీఏ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఫేజ్-2లో మొత్తం 98,975 చదరపు గజాల విస్తీర్ణంలో అన్ని విధాలా అభివృద్ధి చేసిన 300 ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. ఒక్కో ప్లాట్ 500 చదరపు గజాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. వీటి కనిష్ట ధర గజానికి రూ.25 వేలుగా నిర్ణయించింది.
ఈ వేలంపాటలో పాల్గొనాలనుకొనేవారు ఈనెల 21లోగా రూ.1,180 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో లక్ష రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కూడా జమా చేయవలసి ఉంటుంది.
ఇదే లేఅవుట్లో ఫేజ్-1లో ఇదివరకు వేలంవేసినప్పుడు చదరపు గజానికి కనిష్టంగా రూ.72 వేలు, గరిష్టంగా రూ.1.05 లక్షలు పలికింది. ఇప్పుడు ఫేజ్-2లో కూడా ఇంచుమించు అంతే పలకవచ్చని కనుక వీటి అమ్మకం ద్వారా సుమారు రూ.800 కోట్లు ఆదాయం లభించవచ్చని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.
ప్రభుత్వం అవసరాలకు భూములు అమ్మడం సర్వసాధారణమైన విషయమే. అయితే అభివృద్ధిపనులకు ఉపయోగించాల్సిన ఆ సొమ్మును అధికార పార్టీ మళ్ళీ ఎన్నికలలో గెలిచేందుకు ప్రజలకు వరాల రూపంలో పంచిపెట్టడమే సబబు కాదు.