తెలంగాణ బిజెపికి మాజీ మంత్రి చంద్రశేఖర్ గుడ్ బై!

August 13, 2023


img

ఇంతకాలం తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి బిజెపియే ప్రత్యామ్నాయమని అందరూ భావించేవారు. ఆ క్రెడిట్ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌దే అని అందరికీ తెలుసు. కానీ ఆయన ఒంటెత్తు పోకడల వలననే ఇతర పార్టీల నేతలెవరూ బిజెపిలో చేరేందుకు ఆసక్తిచూపడం లేదని, పార్టీలో ఉన్న సీనియర్స్ కూడా పార్టీ కార్యక్రమాలతో అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని కొందరు బిజెపి అధిష్టానానికి ఫిర్యాదులు చేసి బండి సంజయ్‌ని ఆ పదవిలో నుంచి తప్పించేశారు. 

అయితే బండి సంజయ్‌ని అధ్యక్ష పదవిలో నుంచి తప్పించేశాక ఇప్పుడు ఇతర పార్టీల నేతలు బిజెపిలోకి క్యూ కడుతున్నారా?అంటే లేదు. అందరూ కాంగ్రెస్ పార్టీలోకే క్యూ కడుతున్నారు. 

పోనీ.. ఇంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేతలు ఇప్పుడు యాక్టివ్‌ అయ్యారా? అంటే అదీ లేదు. జితేందర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు నేటికీ పార్టీతో అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. పైగా ఇప్పుడు బిజెపిలో నేతలే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోతున్నారు. 

ఇందుకు తాజా ఉదాహరణగా మాజీ మంత్రి, సీనియర్ బిజెపి నేత చంద్రశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. తనవంటి సీనియర్ నేతలను కూడా పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని రాజీనామా లేఖలో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ బిజెపి కలిసి తెలంగాణ రాష్ట్రానికి ఏదో మేలు చేస్తాయనుకొంటే, అవి కేసీఆర్‌తో కుమ్మక్కయ్యాయని చంద్రశేఖర్ ఆరోపించారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.         

మాజీ మంత్రి చంద్రశేఖర్ మొదట టిడిపిలో ఆ తర్వాత టిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలలో పనిచేసారు. గత మూడేళ్ళుగా బిజెపిలో ఉన్నారు. అయితే బండి సంజయ్ మార్పుతో రాష్ట్ర బిజెపిలో ఒక్కసారిగా అయోమయం ఏర్పడటం, ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకోవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకే బిజెపికి రాజీనామా చేసిన్నట్లు తెలుస్తోంది. బహుశః త్వరలోనే కాంగ్రెస్‌ చేరికపై స్పష్టత రావచ్చు.


Related Post