కేంద్రం గుప్పిట్లోకి ఈసీ... సీజెఐని తప్పిస్తూ బిల్లు!

August 11, 2023


img

భారత్‌ ప్రజాస్వామ్యదేశం. కనుక ప్రభుత్వాలు దానిని గౌరవిస్తూ మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలి. అంటే వేలకోట్లు ఖర్చు చేసి కొత్త పార్లమెంట్ భవనం కట్టడం కాదు. ఆ పార్లమెంటు భవనంలో తీసుకొనే ప్రతీ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేదిగా ఉండాలి. కానీ అదే జరగడం లేదు.

రాజ్యాంగ బద్దమైన ఎన్నికల కమీషన్‌కు నిష్పక్షపాతంగా పారదర్శకంగా పనిచేయాలంటే దానిపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు ఉండకూడదు. కానీ అది కేంద్ర ప్రభుత్వ పెద్దల కనుసన్నలలో పనిచేయాల్సివస్తే?ఇప్పుడదే జరుగబోతోంది. 

ఈసీలో కమీషనర్లని ఎంపిక చేసే కమిటీలో నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి ఆ స్థానంలో కేంద్ర మంత్రి ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఓ బిల్లుని రాజ్యసభలో నిన్న ప్రవేశపెట్టింది! దాని ప్రకారం ప్రధానమంత్రి నేతృత్వంలో ఏర్పాటయ్యే ఆ కమిటీలో లోక్‌సభ విపక్ష నాయకుడు, ప్రధాని నామినేట్ చేసిన ఓ కేంద్రమంత్రి సభ్యులుగా ఉంటారు. ఈసీ కమీషనర్ల నియామకంలో ఇకపై సుప్రీంకోర్టుకి సంబంధం ఉండదు. 

ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. కానీ మోడీ ప్రభుత్వానికి ఎటువంటి వివాదాస్పదమైన బిల్లులనైనా పార్లమెంటులో ఆమోదింపజేసుకొనేందుకు తగినంత బలం ఉంది. కనుక ఈ బిల్లును కూడా ఆమోదింపజేసుకోవడం ఖాయమే. 

ఈసీలో ఎన్నికల కమీషనర్లుగా ఎవరు ఉండాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్నప్పుడు, సహజంగానే తమకు అనుకూలంగా ఉన్నవారికే ఆ పదవులు కట్టబెడుతుంది. ఈసీలో ఆ పదవులను ఆశిస్తున్నవారు కూడా కేంద్రం కనుసన్నలలో పనిచేసేందుకు సిద్దపడతారని వేరే- చెప్పక్కరలేదు. 

కనుక ఈ బిల్లు ద్వారా కేంద్రం ఎన్నికల సంఘాన్ని తన అధీనంలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తోందని చెపొచ్చు. మరో 4-5 నెలల్లో ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు, మరో 8-9 నెలలో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఈ బిల్లు ఈసీ పనితీరుపై ప్రభావం చూపకుండా ఉంటుందా?


Related Post