గద్దర్ వచ్చి చెప్పలేడుగా... రేవంత్‌ ఎన్నైనా చెప్పొచ్చు

August 09, 2023


img

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇవాళ్ళ మీడియాతో మాట్లాడుతూ, “గద్దరన్న చివరి రోజులలో నాతో ఓ మాట చెప్పాడు. లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ రెండూ ఒకట్టయ్యాయి. కనుక ఏదో ఆషామాషీగా కాకుండా వ్యూహాత్మకంగా యుద్ధం చెయ్యమని చెప్పారు.

అలాగే గద్దరన్న నాకు మరో సలహా కూడా చెప్పారు. ఓ రాజకీయనాయకుడితో పోరాడవచ్చు.  లేదా ఓ క్రిమినల్‌తో కూడా పోరాడవచ్చు. ఎవరితో పోరాడుతుంటే దానికనుగుణంగా ప్లాన్ చేసుకొని పోరాడవచ్చు. కానీ ‘పొలిటికల్ క్రిమినల్’ అయిన కేసీఆర్‌తో పోరాడేటప్పుడు ఆయనలో ఆ ఇద్దరినీ దృష్టిలో ఉంచుకొని పోరాడాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమే కానీ తెలంగాణ ప్రజలు నీపై చాలా నమ్మకం ఉంచుకొన్నారు. కనుక జాగ్రత్తగా ముందుకు సాగుతూ ఈ ‘పొలిటికల్ క్రిమినల్’ కేసీఆర్‌ని ఎదుర్కొని ఓడించి గద్దె దింపి తెలంగాణను ఆయన బారి నుంచి కాపాడు,” అని చెప్పారన్నారు. 

ఇప్పుడు గద్దర్ వచ్చి తాను రేవంత్‌ రెడ్డికి ఆ సలహాలు ఇచ్చానని చెప్పుకోలేరు కనుక ఆయన పేరు చెప్పుకొని రేవంత్‌ రెడ్డి ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు. ఈ వెసులుబాటు గద్దర్‌తో పరిచయం ఉన్న ప్రతీ ఒక్క రాజకీయనాయకుడుకి కూడా ఉంటుంది. వారిలో బిజెపి, బిఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. కనుక రేపు వారు కూడా గద్దరన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాతో ఈవిదంగా అన్నారంటూ సొంత వాదనలు వినిపించవచ్చు. కనుక రేవంత్‌ రెడ్డి సిఎం కేసీఆర్‌ను, బిఆర్ఎస్‌ పార్టీని ఎదుర్కోవాలనుకొంటే అందుకు గద్దరన్న పేరు చెప్పుకొనవసరం లేదు. కేసీఆర్‌ గురించి ఆయన చెప్పదలచుకొన్నది నేరుగానే చెప్పవచ్చు కదా? 


Related Post