కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు అనర్హత కేసులో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన అనర్హత విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులు 15 రోజులలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఆయన అనర్హత తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది కనుక వనమా వెంకటేశ్వరరావు మళ్ళీ ఎమ్మెల్యేగానే పరిగణింపబడతారు. మళ్ళీ కోర్టు వాయిదా మొదలయ్యేసరికి లేదా మరో వాయిదాలోగా ఎలాగూ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కనుక అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పినా పెద్దగా నష్టం ఉండదు.
ఎమ్మెల్యేగా ఆయన పొందిన జీతభత్యాలు ప్రభుత్వానికి వాపసు చేయాల్సి రావచ్చు. మాజీ ఎమ్మెల్యేగా లభించే పెన్షన్ పోతుంది. కానీ 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా బాగానే సంపాదించుకొన్నారు కనుక ఇదేమి పెద్ద నష్టం కాబోదు. కానీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేలోగా సుప్రీంకోర్టు తుదితీర్పు చెప్పకపోతే మళ్ళీ పోటీ చేయడానికి సాంకేతికంగా ఇబ్బందులు తప్పవు.