ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, దానిలో పనిచేస్తున్నవారందరినీ ప్రభుత్వోద్యోగులుగా పరిగణించాలని నిర్ణయించి బిల్లుని సిద్దం చేసింది. అయితే అది ఆర్ధిక అంశాలతో ముడిపడి ఉన్న వ్యవహారం కనుక నిబందనల ప్రకారం దానికి ముందుగా గవర్నర్ ఆమోదం తప్పనిసరి. కనుక తెలంగాణ ప్రభుత్వం ఆ బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదానికి పంపించింది. అయితే ఇంతవరకు ఆమె దానికి ఆమోదముద్ర వేయలేదు.
ఈసారి శాసనసభ సమావేశాలు కేవలం మూడు రోజులే నిర్వహించి రేపటితో ముగించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆ బిల్లుకి ఆమోదం తెలిపి పంపిస్తే నేడు శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ మరికొద్ది సేపటిలో రెండో రోజు సమావేశాలు ముగియబోతున్నా ఇంతవరకు గవర్నర్ ఆ బిల్లుకు ఆమోదం తెలుపలేదు.
ఒకవేళ ఈరోజు సాయంత్రంలోగా ఆమోదముద్ర వేసి పంపిస్తే రేపటి సమావేశాలలో ఆమోదించుకోగలదు. రేపటిలోగా ఆ బిల్లు ప్రభుత్వం చేతికి అందకపోతే సమావేశాలు మరోరోజు పొడిగించుకోవలసిరావచ్చు. అప్పటికీ రాకపోతే అది ఎప్పుడు వస్తే అప్పుడు మళ్ళీ దాని కోసం మరోసారి ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ విషయం గవర్నర్‌కు తెలిసి ఉన్నప్పటికీ ఈ బిల్లును వెంటనే ఆమోదించకుండా తొక్కిపెట్టి ఉంచడంతో మళ్ళీ రాజ్‌భవన్-తెలంగాణ ప్రభుత్వం మద్య కొత్త యుద్ధం ప్రారంభమయ్యేలా ఉంది. అయితే ఇంకా మరో రోజు సమయం ఉంది కనుక మంత్రులు సంయమనం పాటిస్తూ మౌనంగా ఉండిపోయి వేచి చూస్తున్నారు. ఒకవేళ రేపటి సమాఆ బిల్లు వేశాలకు అందకపోతే ఆమెపై మళ్ళీ యుద్ధం ప్రారంభించడం ఖాయం.
ఇది టీఎస్‌ఆర్టీసీలో 43,373 మందికి ప్రయోజనం కలిగే బిల్లు కనుక దీనిని గవర్నర్ ఆమోదించకపోతే బిఆర్ఎస్ నేతలకు మరో బలమైన అస్త్రం అందించినట్లవుతుంది. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తమ ప్రభుత్వం మేలుచేయాలనుకొన్నా మోడీ ప్రభుత్వం గవర్నర్ చేత దానిని అద్దుకొంటోందని విమర్శించడం మొదలుపెటాడతారు. ఈవిషయం కూడా ఆమెకు తెలుసు కనుక రేపు సమావేశాలు ముగిసేలోగా ఆమోదముద్ర వేసి పంపించవచ్చు.