రాహుల్ గాంధీ జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే!

August 04, 2023


img

"నేరాలు చేస్తున్నవారిలో చాలా మంది ఇంటి పేరు ‘మోడీ’ అని ఎందుకు ఉంటుందో?" అంటూ గత ఎన్నికలలో రాహుల్ గాంధీ నోరుజారారు. అందుకు గుజరాత్‌ కోర్టు ఆయనకు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. దానిపై హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందని మోడీ ప్రభుత్వానికి తెలిసి ఉన్నప్పటికీ హడావుడిగా ఆయన లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడుగా ప్రకటించేసింది. రాహుల్ గాంధీ నోరు జారినందుకు విమర్శిస్తున్న బిజెపి, ఆయనపై అనర్హత వేటు వేసినందుకు తీవ్ర విమర్శలపాలైంది. 

ఈ కేసులో గుజరాత్‌ హైకోర్టు దిగువ కోర్టు తీర్పునే సమర్ధించడంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకి విధించిన జైలు శిక్షని నిలిపివేస్తూ స్టే విధించింది. దిగువకోర్టులు ఈ కేసులో సమర్పించిన పత్రాల సంఖ్యనే చూసి తీర్పు చెప్పిన్నట్లుంది కానీ వాటిలో ఏముందో చూసిన్నట్లు లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా చురకలు వేసింది.

రాహుల్ గాంధీకి గరిష్ట శిక్ష విధించేటప్పుడు దానికి తగిన కారణాలను కూడా తీర్పులో చూపించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. రాహుల్ గాంధీకి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తూనే,”ప్రజాజీవితంలో ఉన్నవారు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలని” హితవు చెప్పింది. 

రాహుల్ గాంధీ జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడం కేంద్ర ప్రభుత్వానికి చెంపదెబ్బవంటిదే అని చెపొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయనపై అనర్హత వేటును ఉపసంహరించుకోక తప్పదు. కనుక రాహుల్ గాంధీ మళ్ళీ త్వరలోనే పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు.


Related Post