చికోటీతో బండి భేటీ... మరోసారి తప్పుడు సంకేతాలు?

August 04, 2023


img

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్‌ని సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ పదవిలో నుంచి తప్పించి ఆయన స్థానంలో కిషన్‌రెడ్డిని నియమించడం రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమేనని బిజెపి అధిష్టానానికి బహుశః ఈపాటికే అర్దమై ఉంటుంది. ఇంతకాలం బిజెపి  గురించి మాట్లాడుకొన్న రాష్ట్ర ప్రజలు, ఇప్పుడు కాంగ్రెస్‌ గురించి మాట్లాడుకొంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందా రాదా? అనేది అప్రస్తుతం. కానీ తెలంగాణ బిజెపికి జరిగిన నష్టాన్ని సరిదిద్దుకొనే ప్రయత్నం చేయకపోగా ప్రజలకు మళ్ళీ మరోసారి తప్పుడు సంకేతం పంపించింది. 

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌ నిన్న బండి సంజయ్‌తో భేటీ అయ్యారు. వారిరువురి ఫోటోలతో ఈ వార్త అన్ని ప్రసారమాద్యమాలలో వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో పలువురు ప్రముఖుల కోసం చీకోటి ప్రవీణ్‌ ఖాట్మండు (నేపాల్)లోని ఓ స్టార్ హోటల్లో రెండు రోజులు క్యాసినో నిర్వహించిన సంగతి తెలిసిందే. 

అప్పుడు నేపాల్ పోలీసులు ఆ హోటల్‌పై దాడి చేసి చీకోటితో సహా పలువురిని అరెస్ట్‌ చేశారు. అక్కడ నుంచి ఎలాగో బయటపడిన భారత్‌ చేరుకొన్న తర్వాత అతనిపై ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

ఇవన్నీ సరిపోవన్నట్లు చీకోటి ప్రవీణ్‌ నిషేదిత జంతువులు, పక్షులను పెంచుకొంటున్నాడు. వాటితో దిగిన ఫోటోలు మీడియాలోకి రావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 

అటువంటి వివాదాస్పద వ్యక్తి వచ్చి బండి సంజయ్‌తో భేటీ అవడం, వారి ఫోటోలు మీడియాలో విస్తృతంగా రావడంతో ఆర్ధికనేరగాళ్ళకు బిజెపి అండగా నిలబడుతుందనే సంకేతాలు ప్రజలకు పంపిన్నట్లయ్యింది. 

ఆర్ధికనేరాలు చేసిన రాజకీయ నాయకులు ఎవరు ఎవరిని కలిసినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు కానీ ఇటువంటి వ్యక్తులను కలవడాన్ని తప్పుగానే భావిస్తారు. తెలంగాణలో బిజెపి తీరు చూస్తుంటే కూర్చోన్న కొమ్మను నరుక్కొంటున్నట్లే ఉంది.



Related Post