రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఏపీకి చెందిన నేతలు హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని ఎంతగా ఒత్తిడి చేసినప్పటికీ యూపీయే ప్రభుత్వం వాటికి తలొగ్గకపోవడంతో హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పడింది.
అయితే రాబోయే రోజుల్లో హైదరాబాద్‌తో సహా దేశంలో చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం కుట్రలు చేస్తోందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ దాని సర్వాధికారాలు గుంజుకొని తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికే మోడీ ప్రభుత్వం ఢిల్లీ బిల్లుని ప్రవేశపెట్టిందని ఆరోపించారు. ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ కూడా ఒకప్పుడు మోడీ మనిషే అని, అప్పుడు దివంగత ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు చెక్ పెట్టేందుకు ఆయనను ముందుకు తీసుకువచ్చారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఆయన ఏకుమేకవడంతో ఢిల్లీ ప్రభుత్వాన్ని మోడీ తన గుప్పిట్లో పెట్టుకొనేందుకు ఈ అప్రజాస్వామికమైన బిల్లుని ప్రవేశపెట్టి మందబలంతో ఆమోదింపజేసుకొంటున్నారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
ఒకవేళ ప్రధాని నరేంద్రమోడీ, అర్వింద్ కేజ్రీవాల్ మద్య రాజకీయ విభేధాలు ఉంటే బయట చూసుకోవాలి కానీ ఢిల్లీ ప్రభుత్వ గౌరవాన్ని కాలరాయకూడదని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
ఆనాడు దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజిపేయి ఇదే లోక్‌సభలో ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించేందుకు బిల్లుని ప్రవేశపెడితే, ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ ప్రభుత్వ హక్కులు, అధికారాలను కాలరాస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఢిల్లీ తర్వాత హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించి, కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను తన గుప్పెట్లో పెట్టుకోవచ్చని, ఆరోజు ఎంతో దూరం లేదని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.