కాంగ్రెస్‌ అభ్యర్ధులను బిఆర్ఎస్ నిర్ణయిస్తుందా?

August 04, 2023


img

తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్ధులను బిఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తుందా?అంటే అవుననే అంటున్నారు మంత్రి మల్లారెడ్డి. గత ఎన్నికలలోకిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి మేడ్చల్ టికెట్‌ ఇప్పించానని, ఈసారి కూడా అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఎవరు పోటీచేయాలో తానే డిసైడ్ చేస్తానని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ కాంగ్రెస్‌ నేతల కొట్లాడుకొంటున్నప్పుడు అవసరమైతే తానే కలుగజేసుకొని చక్కదిద్దుతుంటానని మంత్రి మల్లారెడ్డి చెప్పడం విశేషం. 

ఐ‌టి అధికారులు నాలుగు రోజులు తన ఇళ్ళు, కార్యాలయాలు సోదాలు చేసినా వారికి ఏమీ దొరకలేదని, కానీ రాబోయే ఎన్నికలలో ఖర్చు చేసేందుకు తన వద్ద పుష్కలంగా డబ్బు ఉందని కనుక ఖర్చుకు వెనకాడబోనని చెప్పారు. త్వరలోనే సొంతంగా ఓ ఓటీటీని కూడా ప్రారంభిస్తానని, ఈ ఏడాదిలో సొంతంగా సినిమాలు కూడా తీయాలనుకొంటున్నట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు.

ఆయన చెప్పిన మిగిలిన విషయాలన్నిటినీ పక్కన పెట్టినా, కాంగ్రెస్‌ వ్యవహారాలలో తన ప్రమేయం ఉంటుందని, మేడ్చల్ అభ్యర్ధిని తానే ఖరారు చేస్తుంటానని చెప్పడం ఖచ్చితంగా జోక్ కాదు. 

ఇంతకాలం రాష్ట్రంలో బిజెపి బలమైన ప్రత్యర్ధిగా ఉన్నందున బిఆర్ఎస్ నేతలందరూ దాంతో కొట్లాడేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకోవడంతో ఇప్పుడు బిజెపిని పక్కన పెట్టి కాంగ్రెస్‌తో పోరాటం మొదలుపెట్టారు. 

కాంగ్రెస్‌ నేతల ప్రధాన బలహీనత ఏమిటంటే, వారి పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కీచులాడుకొంటూనే ఉంటారు. కనుక వారిలో ఇలాంటి అనుమానాలు, అపోహలు కలిగించి చిచ్చుపెట్టడం ఇంకా సులువు. బహుశః ఆ ప్రయత్నంలోనే మల్లారెడ్డి ఈవిదంగా మాట్లాడుతున్నారనుకోవచ్చు. 

ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ఆ పార్టీ నేతలు కోరుకొంటున్నట్లయితే, బిఆర్ఎస్ పార్టీకి ఇలాంటి అవకాశం ఇవ్వకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయడం నేర్చుకోవలసి ఉంటుంది.


Related Post