ఇక నేడో రేపో ఎన్నికల గంట మ్రోగబోతోంది.కనుక సిఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. మొన్న టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, దానిలో ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నట్లు ప్రకటించగా తాజాగా నేటి నుంచే పంట రుణాల మాఫీ హామీని అమలుచేసేందుకు సిద్దం అవుతున్నారు.
2018 ఎన్నికలలో ఇచ్చిన ఆ హామీని ఇంతవరకు పూర్తి చేయలేదు. ఏమంటే పెద్దనోట్ల రద్దుతో సంక్షోభం ఏర్పడిందని, ఆ తర్వాత కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని, కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం వలన రుణాలు పొందలేకపోయామని చెపుతున్నారు.
ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి కనుక తక్షణమే పంట రుణాల హామీని అమలుచేయాలని నిర్ణయించిన్నట్లు చెప్పారు. రేపటి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించి సెప్టెంబర్ రెండోవారంలోగా పూర్తి చేయాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే తమ ప్రభుత్వం ధ్యేయం కనుక పంట రుణాల హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
ఇన్నేళ్ళు ఆలస్యం చేసి ఇప్పుడు అమలుచేస్తున్నందుకు రైతులకు క్షమాపణలు చెప్పుకోవలసి ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు మొదలుపెట్టమని మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడం విస్మయం కలిగిస్తుంది. అంటే ఈ ఎన్నికల కోసమే ఇంతకాలం ఈ హామీ అమలుచేయకుండా పక్కన పెట్టి ఉంచేశారా? అనే అనుమానం కలుగుతోంది.
ప్రభుత్వం చెపుతున్న ఆ సంక్షోభాలన్నీ నిజమే. అయితే అవి ముగిసి చాలా కాలమే అయ్యింది. ఆ తర్వాత వేలకోట్లు ఖర్చు చేసి వైట్‌హౌస్ వంటి సచివాలయం, 125 అడుగుల డా.అంబేడ్కర్ విగ్రహం, తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం, రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత కలెక్టరేట్ భవనాలు, జిల్లాకో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం, వరంగల్లో 22 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వంటి అనేక భవనాలు నిర్మించారు. ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు.
ఇవన్నీ రాష్ట్ర అవసరాలకు, పరిపాలనా సౌలభ్యానికి, ఆత్మగౌరవానికి, ప్రతిష్టకు అవసరం కనుక ఎవరూ తప్పు పట్టలేరు. కానీ వరుస సంక్షోభాల వలన ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడా దళిత బంధు, గిరిజన బంధు, మైనార్టీ బంధు, లక్ష రూపాయల ఆర్ధిక సాయం కూడా అందిస్తున్నారు.
ఒకేసారి ఇన్ని వేలకోట్లు ఖర్చు చేస్తూ ఇన్ని నిర్మిస్తూ, ఇన్ని భారీ సంక్షేమ పధకాలు అమలుచేస్తునప్పుడు లేని ఆర్ధిక ఇబ్బందులు, రైతులకు ఇచ్చిన పంట రుణాల మాఫీ అమలుచేయడానికే వచ్చిందా?అంటే కాదనే అర్దమవుతోంది. పంట రుణాల మాఫీ హామీకి అంత ప్రాధాన్యం లేదని ప్రభుత్వం భావించడం వల్లనే ఇంతకాలం పక్కన పెట్టేసిందని భావించాల్సి ఉంటుంది.
ఇప్పుడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడిందా?అంటే కాదు ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి కనుక అని భావించాల్సి ఉంటుంది. ఎన్నికలలో ప్రతిపక్షాలు ఈ హామీలను ప్రజలకు గుర్తుచేసి నిలదీస్తే నష్టపోతామనే భయంతో అమలుచేస్తున్నట్లు అర్దమవుతూనే ఉంది. అయినా బిఆర్ఎస్ పార్టీ గత ఎన్నికలలో గెలిచేందుకు ఏవేవో హామీలు ఇస్తే, వాటికీ కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చాలా? లేకపోతే దానిని నిందిస్తారా?
సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అది విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. అప్పుడు ఈ హమీ అమలుచేయలేరు కనుకనే ఇప్పుడు హడావుడిగా మొదలుపెట్టిన్నట్లు అర్దమవుతూనే ఉంది. ‘ఈ వరాలన్నీ ఎన్నికల స్టంట్సే’ అని మంత్రి మల్లారెడ్డి ఒప్పేసుకొన్నాక ఇంకా మొహమాటం దేనికి?