జూపల్లి కృష్ణారావు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. అక్కడ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. ఆయన కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొన్నారు.
అయితే తన కాంగ్రెస్ అధిష్టానానికి, నియోజకవర్గంలో ప్రజలకు తన బలం చాటుకొనేందుకు కొల్లాపూర్‌లో భారీ బహిరంగసభ నిర్వహించి, దానికి ప్రియాంక గాంధీని ఆహ్వానించి ఆమె సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొన్నారు. అందుకు ఆమె కూడా అంగీకరించారు.
కానీ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం, వరదలతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో బహిరంగసభ నిర్వహించలేకపోయారు. కనుక ఇవాళ్ళ ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి, పరిస్థితులు చక్కబడ్డాక అప్పుడు బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ రెండు జిల్లాలలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల బలాలు ఖచ్చితంగా మారుతాయి. కొల్లాపూర్‌లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక ఈ రెండు జిల్లాలలో బిఆర్ఎస్ పార్టీకి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ తప్పదు.