హరీష్ శంకర్‌తో బిజెపి నేతలకి ఏం పనో?

August 02, 2023


img

ఈసారి ఎలాగైనా తెలంగాణ శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని బిజెపి పట్టుదలగా ఉంది. కానీ మరి కొన్ని రోజులలో ఎన్నికల గంట మ్రోగబోతుంటే కీలకమైన ఈ సమయంలో తెలంగాణలో బిజెపిని గెలుపుబాటలో నడిపిస్తున్న బండి సంజయ్‌ని అధ్యక్ష పదవిలో నుంచి తప్పించేసుకొని పెద్ద పొరపాటు చేసిందని రాజకీయ విశ్లేషకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణ బిజెపి ఇన్‌ఛార్జ్‌ తరుణ్ చుగ్ హైదరాబాద్‌లో దర్శకుడు హరీష్ శంకర్‌ కార్యాలయానికి వెళ్ళి కలిశారు. అక్కడ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సహనిర్మాత వివేక్ కూచిభొట్ల కూడా ఉన్నారు. తరుణ్ చుగ్ వారిరువురికీ కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధికి, ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధికి ఏమేమి చేస్తోందో వివరిస్తున్నట్లు ఆయన చేతిలో ఉన్న పుస్తకాన్ని బట్టి అర్దమవుతోంది. 

ఆ తర్వాత హరీష్ శంకర్‌ ఆయన స్వయంగా తమ కార్యాలయానికి వచ్చి తమని కలిసినందుకు కృతజ్ఞతలు తెలుపుకొంటూ ట్వీట్‌ చేశారు. దానిని బట్టి గత నెల 13న వారు భేటీ అయిన్నట్లు తెలుస్తోంది. ఇదివరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ వచ్చినప్పుడు జూ.ఎన్టీఆర్‌ని నోవాటేల్ హోటల్‌కు పిలిపించుకొని భేటీ అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళితో కూడా భేటీ కావాలనుకొన్నారు కానీ ఇంకా అవలేదు. ఈసారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు భేటీ కావచ్చని తెలుస్తోంది. 

బండి సంజయ్‌ నేతృత్వంలో మంచి దూకుడుగా సాగుతున్న తమ పార్టీలో తామే గందరగోళం సృష్టించుకొని, ఇప్పుడు బిజెపి నేతలు సినీ పరిశ్రమలో వారి చుట్టూ ఎంత తిరిగి ఏం ప్రయోజనం?బిజెపి ఓ గొప్ప అవకాశాన్ని చేజార్చుకోవడంతో కాంగ్రెస్ పార్టీ దానిని అందిపుచ్చుకొని తెలంగాణలో దూసుకుపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

   


Related Post