గత ఆరు దశాబ్ధాలలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తైతే గత 9 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ఒక్కటీ మరో ఎత్తని బహుశః ప్రజలందరూ అంగీకరిస్తారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో రియల్ ఎస్టేట్ రంగం కూడా దానికి రెట్టింపు వేగంతో అభివృద్ధి చెందుతూ ఆకాశమంత ఎత్తుకి ఎదిగిపోయింది.
ఇప్పుడు హైదరాబాద్‌లో 20-30 అంతస్తుల అపార్ట్‌మెంట్స్ కూడిన గేటడ్ కమ్యూనిటీలు ఎన్నో లెక్కేలేదు. వాటికి చాలా డిమాండ్ ఉన్నందున ఇంకా అనేక ఆకాశ హర్మ్యాలు నిర్మించబడుతూనే ఉన్నాయి.
అయితే ఇప్పుడు హైదరాబాద్‌లో వరద భీభత్సం, దాంతో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండటం చూస్తున్నప్పుడు కొన్ని నెలల క్రితం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు గుర్తుచేసింది.
ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, “హైదరాబాద్‌లో చిన్న వర్షం పడినా మోకాలిలోతు నీళ్ళు నిలిచిపోతున్నాయిప్పుడు. దాంతో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. ఏం... గతంలో హైదరాబాద్‌లో వర్షాలు పడలేదా? అప్పుడు రోడ్లు ఇలా నీట మునిగాయా?ఇంత ట్రాఫిక్ జామ్ అయ్యేదా? కానీ ఇప్పుడే ఇలా ఎందుకు జరుగుతోంది?అంటే కేవలం 3,000 చదరపు గజాల స్థలంలో 20-30 అంతస్తుల ఇళ్ళు నిర్మించడానికి కేసీఆర్ ప్రభుత్వం అనుమతించడం వలననే.
కేసీఆర్ కమీషన్ల కోసం కక్కుర్తిపడి నగరంలో బహుళ అంతస్తులకు అనుమతులు ఈయడం వలన, వాటిలో నివసించేవారి వాహనాలు పెరిగిపోయాయి. ఒక్కొక్కరికి ఒకటి లేదా రెండు కార్లు, బైకులు ఉండటంతో అవన్నీ రోడ్లపైకి వచ్చేస్తుంటే ట్రాఫిక్ జామ్ అవకుండా ఏమవుతుంది?
హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాలున్నాయి. కనుక నగరాన్ని అటుగా విస్తరించవలసి ఉండగా, పైకి నిలువుగా విస్తరించుకుపోతున్నారు. ఇంత తక్కువ స్థలంలో బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇస్తుండటం వలననే హైదరాబాద్ నగరంలో నేడు ఈ దుస్థితి ఏర్పడింది,” అంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తుంటారని దీనిని తేలికగా కొట్టిపడేయలేము. ఈ విమర్శలలో కమీషన్ల సంగతి పక్కన పెట్టి చూస్తే ఇవి చాలా సహేతుకంగా ఉన్నట్లు అర్దమవుతుంది.
ఈ 9 ఏళ్ళలో ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు 35 ఫ్లైఓవర్లు ప్రభుత్వం నిర్మించింది. అనేక అండర్ పాసులు నిర్మించింది. అవుటర్ రింగ్ రోడ్ నిర్మించింది. ఇంకా నిర్మిస్తూనే ఉంది. అయినా చిన్న వర్షం పడితే హైదరాబాద్‌లో రోడ్లు నీట మునుగుతూనే ఉన్నాయి. ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్‌లు అవుతూనే ఉన్నాయి. కనుక రేవంత్ రెడ్డి విమర్శలను నిర్మాణాత్మక సలహాలుగా స్వీకరించి నగరాన్ని ఆకాశంవైపు నిలువుగా కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు అడ్డంగా విస్తరించాల్సిన అవసరం కనిపిస్తోంది.
హైదరాబాదులో చెరువులు కబ్జా అవుతున్నాయి. అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు హైదరాబాదును అడ్డంగా విస్తరించాల్సింది పోయి నిలువుగా విస్తరిస్తున్నారు అందుకే ఈ రోజు ట్రాఫిక్ జామ్ లు అవుతున్నాయి. వర్షం పడగానే రోడ్డు మీదికి మోకాళ్ల లోతు నీళ్లు వస్తున్నాయని గతంలోనే వెల్లడించారు.
— Telangana Congress (@INCTelangana) July 28, 2023
- శ్రీ… pic.twitter.com/9EQflu2pzR