కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టు కూడా షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దిగువకోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో సవాలు చేయగా అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బే తగిలింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దిగువ కోర్టు తీర్పు అమలుచేయకుండా స్టే విధించాలని కోరుతూ ఆయన వేసిన మరో పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు సింగిల్ బెంచ్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది.
2018 ముందస్తు ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన జలగం వెంకట్ రావు, కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. దాంతో వనమా వెంకటేశ్వరరావు తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించారంటూ జలగం వెంకట్ రావు కోర్టులో కేసు వేసారు. దానిపై సుదీర్గంగా విచారణ జరిపిన న్యాయస్థానం వనమాను అనర్హుడిగా ప్రకటించి, జలగం వెంకట్ రావును 2018 నుంచి ఎమ్మెల్యేగా పరిగణించాలని తీర్పు చెప్పింది.
ఆ తీర్పునే వనమా వెంకటేశ్వరరావు హైకోర్టులో సవాలు చేయగా హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తాను దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్ళాలనుకొంటున్నందున, దిగువకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ వనమా వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
కనుక వనమా తన ఎమ్మెల్యే పదవి కోల్పోయిన్నట్లయింది. కానీ హైకోర్టు తీర్పు చెప్పకుండా రిజర్వు చేసినందున ఆయన పదవిలో ఉన్నట్లే భావించాల్సి ఉంటుంది. దీంతో వనమా పరిస్థితి అయోమయంగా మారింది.
మరోపక్క జలగం వెంకట్ రావు దిగువ కోర్టు తీర్పు కాపీని శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులకు సమర్పించి, తన చేత ప్రమాణస్వీకారం చేయించాలని కోరుతున్నారు. కానీ ఈ కేసు ఇంకా హైకోర్టులో ఉంది. అది తేలకుండా జలగం వెంకట్ రావు చేత ప్రమాణస్వీకారం చేయిస్తే, రేపు హైకోర్టు తీర్పు వేరేలా వస్తే చాలా ఇబ్బందవుతుంది. కనుక ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించలేదు. దీంతో ప్రస్తుతం జలగం పరిస్థితి కూడా అయోమయంగానే మారింది.