హైదరాబాద్‌కి అమిత్‌ షా... వరద పరిశీలన కోసం కాదు!

July 27, 2023


img

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శనివారం హైదరాబాద్‌ రానున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు వస్తున్నారనుకొంటే పొరపాటే. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో హైదరాబాద్‌లో మేధావులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, కళాకారులు, ఉద్యమాకారులు, పలువురు ప్రముఖులను కలిసేందుకు మాత్రమే వస్తున్నారు.

శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి జెఆర్‌సీ కన్వెవెన్షన్ సెంటర్‌లో చేరుకొని వారితో సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడి నుండి శంషాబాద్‌లోని నోవాటేల్ హోటల్‌కు చేరుకొంటారు. అక్కడ సాయంత్రం 5.15 నుంచి రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర బిజెపి ముఖ్య నేతలతో సమావేశమయ్యి త్వరలో జరుగబోయే ఎన్నికల గురించి, ప్రచార సభల గురించి చర్చిస్తారు. వారితో సమావేశం ముగిసిన తర్వాత శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తిరిగి బయలుదేరి వెళతారు. 

భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వరద పరిస్థితిని సమీక్షించి అవసరమైన సాయం అందించడానికి వస్తున్నట్లయితే ప్రజలు, ప్రభుత్వమూ కూడా హర్షించి ఉండేవారు. కానీ ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా కేవలం రాజకీయాలకోసమే రాష్ట్రానికి వచ్చి వెళ్ళడం సరికాదనే చెప్పాలి. రేపు బిఆర్ఎస్ నేతలు కూడా ఇదే మాట అనకుండా ఉంటారా?



Related Post