మణిపూర్ ఘటనలపై పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోడీ సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు కాంగ్రెస్, మిత్రపక్షాల ‘ఇండియా’ కూటమి మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. “మణిపూర్ అల్లర్ల గురించి తాము గట్టిగా నిలదీస్తుండటంతో ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటుకు రాకుండా మొహం చాటేస్తున్నారని, ఆయనను పార్లమెంటుకి రప్పించి సంజాయిషీ ఇప్పించేందుకు చివరి అస్త్రంగా దీనిని ప్రయోగిస్తున్నామని,” కాంగ్రెస్ ఎంపీ మాణిక్‌రావు థాక్రే చెప్పారు.
బిఆర్ఎస్ పార్టీ కూడా నేడే పార్లమెంటులో వేరేగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. బిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ, “మణిపూర్ అల్లర్లపై దేశ ప్రజలందరూ చాలా ఆందోళన చెందుతున్నారు. కనుక ప్రధాని మోడీ స్వయంగా తన నోటితో వివరణ ఇస్తే అందరూ శాంతిస్తారనే ఉద్దేశ్యంతో మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాము,” అని చెప్పారు.
‘ఇండియా’ కూటమి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారంలోకి రావాలని తహతహలాడుతోంది కనుక అది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని అర్దం చేసుకోవచ్చు. కానీ కేవలం 12 మంది ఎంపీలు మాత్రమే ఉన్న బిఆర్ఎస్ పార్టీ కూడాఅవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తునా ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకే ఈ తీర్మానం ప్రవేశపెట్టి ఉండవచ్చు. తద్వారా తమకూ, బిజెపికి ఎటువంటి సంబందమూ, రహస్య అవగాహన లేదని, తాము కూడా మోడీ ప్రభుత్వంతో పోరాడుతున్నామని తెలంగాణ ప్రజలకు చెప్పుకొనేందుకే బహుశః ఇది ప్రవేశపెట్టి ఉండవచ్చు.