పట్నం మహేందర్ రెడ్డి కారు దిగబోతున్నారా?

July 25, 2023


img

తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బిఆర్ఎస్‌ పార్టీలో టికెట్లు ఆశిస్తున్నవారిలో ఆందోళన నానాటికీ పెరిగిపోతోంది. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్స్ ఇస్తానని సిఎం కేసీఆర్‌ ప్రకటించడమే ఇందుకు కారణం. మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తే ఇక తమకెప్పుడు అవకాశం వస్తుందని మిగిలినవారు ఆందోళన చెందుతున్నారు. వారిలో తాండూర్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి కూడా ఒకరు.

తాండూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నలుగురు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆయన చాలా చాకచక్యంగా వ్యవహరించి తమతో బేరసారాలు చేసేందుకు వచ్చిన ముగ్గురు బిజెపి ప్రతినిధులను ఏసీబీ పోలీసులకు రెడ్ హ్యాండడ్‌గా పట్టించి కేసీఆర్‌ మన్ననలు పొందారు. 

కనుక మళ్ళీ ఆయనకే తాండూర్ టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది. అయితే పట్నం మహేందర్ రెడ్డి తన టికెట్‌ విషయం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్ళారు గానీ ఇంతవరకు అయన స్పందించకపోవడంతో కాంగ్రెస్ పార్టీతో టచ్చులోకి వెళ్ళిన్నట్లు తెలుస్తోంది. 

పైలట్ రోహిత్ రెడ్డి మొదట కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. ఆయన బిఆర్ఎస్‌ పార్టీలోకి వెళ్లిపోవడంతో తాండూర్ సీటును పట్నం మహేందర్ రెడ్డికి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకరించింది. అంతేకాదు... ఆయన భార్య సునీతకు చేవెళ్ళ నుంచి లోక్‌సభ టికెట్‌ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కనుక కేసీఆర్‌ ఏ సంగతీ తేల్చేస్తే పట్నం దంపతులు కారు దిగి కాంగ్రెస్‌ స్నేహ హస్తం  అందుకోవడానికి సిద్దంగా ఉన్నారు. 

ఆయన తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు మళ్ళీ టికెట్‌ లభిస్తుంది కనుక అన్నయ్యతో కలిసి పార్టీ మారేందుకు నరేందర్ రెడ్డి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కానీ పట్నం దంపతులకు వేరే దారి లేదు కనుక ఒకవేళ కేసీఆర్‌ టికెట్‌ విషయంలో హామీ ఇవ్వకపోతే ఈ శ్రావణమాసంలో మంచి రోజు చూసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు పట్నం దంపతులు సన్నాహాలు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. 


Related Post