తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందున ఆయన ఎన్నిక చెల్లదని, కనుక 2018 ముందస్తు ఎన్నికలలో ఆయనతో పోటీపడి ఓడిపోయిన టిఆర్ఎస్ అభ్యర్ధి జలగం వెంకట్రావుని 2018 డిసెంబర్ నుంచే ఎమ్మెల్యేగా పరిగణించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు వనమాకు హైకోర్టు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది.
వనమా వెంకటేశ్వరరావు గతంలో మూడుసార్లు కొత్తగూడెం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. సమైక్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2018 ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్ధి జలగం వెంకట్రావును 4,120 ఓట్ల తేడాతో ఓడించారు. అప్పుడే జలగం వెంకట్రావు వనమా ఎన్నికను సవాలు చేస్తూ హైకోర్టులో కేసు వేశారు.
అప్పటి నుంచి విచారణ జరిపిన హైకోర్టు మళ్ళీ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతుండగా నేడు తీర్పు చెప్పింది. వనమా దాదాపు నాలుగున్నరేళ్ళు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగారు కనుక హైకోర్టు తాజా తీర్పుతో ఆయనకు రూ.5 లక్షల జరిమానా చెల్లించవలసి రావడం తప్ప పెద్దగా నష్టంలేదనే చెప్పాలి.
అయితే జలగం వెంకట్రావును 2018, డిసెంబర్ నుంచి ఎమ్మెల్యేగా పరిగణించాలని హైకోర్టు సూచించినందున, ఈ నాలుగున్నరేళ్ళకు ప్రభుత్వం ఆయనకు జీతభత్యాలు, సౌకర్యాల కోసం బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ప్రభుత్వం వనమాకు చెల్లించిన జీతభత్యాలు, సౌకర్యాల కోసం చేసిన ఖర్చులను తిరిగి వసూలు చేస్తుందా లేదా?అనేది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది.
2018 ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన వనమా, ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు హైకోర్టు తాజా తీర్పుతో ఆయన పదవి కోల్పోయారు. కనుక బిఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే స్థానంలో మరో ఎమ్మెల్యే వచ్చారన్న మాట!