కాంగ్రెస్ పార్టీ తనను తాను ఓడించుకొన్నప్పుడే ఇతర పార్టీలు గెలుస్తుంటాయని కాంగ్రెస్‌లో అందరూ చెప్పుకొనే మాట! కనుక రాష్ట్రంలో అకస్మాత్తుగా పుంజుకొన్న కాంగ్రెస్ పార్టీని చూసి అధికార బిఆర్ఎస్ నేతలు కంగారూ పడ్డారు. అయితే వారు ఆందోళన చెందనవసరం లేదని కాంగ్రెస్ నేతలే భరోసా కల్పిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి వర్గానికి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గానికి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆదివారం ఘట్‌కేసర్‌లో అనిల్ కుమార్ రెడ్డి వ్యతిరేక వర్గం సమావేశమైంది. ఈ విషయం తెలుసుకొన్న ఆయన కూడా నేడు తన అనుచరులతో భువనగిరిలో సమావేశమయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికలలో గెలిపించేందుకు గట్టిగా కృషి చేస్తుంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీలో వాతావరణాన్ని ఆయన పాడు చేస్తున్నారు. జిల్లాలో నాకు వ్యతిరేకంగా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు. అందరినీ కలుపుకుపోతూ పార్టీని గెలిపించుకోవలసిన ఈ సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుతో పార్టీకి కహాల నష్టం జరుగుతోంది. ఆయనతో చాలా కాలంగానే నేను, నా అనుచరులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మౌనంగా భరిస్తూ వచ్చాము. కానీ మా సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. మేము పార్టీ వీడి వెళ్ళే పరిస్థితి ఆయనే కల్పిస్తున్నారు,” అని కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈరోజు మధ్యాహ్నమే ఆయన మంత్రి జగదీష్ రెడ్డిని కలిసి కారు ఎక్కేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పిన్నట్లు తెలుస్తోంది. సిఎం కేసీఆర్ నుంచి టికెట్‌కు హామీ వస్తే రేపో మారో కారెక్కేయడం ఖాయంగానే కనిపిస్తోంది.