మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని వ్యక్తి, తెలంగాణ ఉద్యమాలలో చాలా చురుకుగా పనిచేశారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత సిఎం కేసీఆర్ ఓ పద్దతి ప్రకారం పార్టీలో ముఖ్య నేతలను బిఆర్ఎస్ పార్టీలో ఆకర్షించి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసినప్పుడు, పార్టీ పరిస్థితి దయనీయంగా మారినప్పటికీ పొన్నం ప్రభాకర్ మాత్రం పార్టీని వీడే ఆలోచన చేయలేదు.
అయితే కాంగ్రెస్ కష్టకాలంలో పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నా, పార్టీ అధిష్టానం బయట నుంచి రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డి వంటి సీనియర్స్ తీవ్ర అసంతృప్తి, అసహనం చెందారు. దాంతో వారు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించలేక, పార్టీలో చురుకుగా పాల్గొనలేకపోయారు. ఆ కారణంగానే వారికి పార్టీలో క్రమంగా ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది.
అదే సమయంలో రేవంత్ రెడ్డి తనకు మద్దతుగా గట్టిగా నిలబడేవారితో ఓ టీమ్ ఏర్పాటుచేసుకొని కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కోరుకొన్నది కూడా అదే కనుక పార్టీలో సీనియర్స్ ఆక్రోశాన్ని, అభ్యంతరాలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వారు మరింత అసంతృప్తికి లోనయ్యారు. అది సహజం కూడా. అటువంటి వారిలో పొన్నం ప్రభాకర్ కూడా ఒకరు.
ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ఎన్నికల కమిటీలలో తనకు ప్రాధాన్యం లభించకపోవడంపై తన అసంతృప్తిని పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే వద్దనే వ్యక్తం చేసారు. పార్టీలో ఎన్నేళ్ళు పనిచేసినా తగిన గుర్తింపు, గౌరవం లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాణిక్‌రావు థాక్రే ఆయనను ఓదార్చి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి తగిన పదవి, బాధ్యతలు అప్పగిస్తానని హామీ ఇచ్చి పంపించారు.