అందుకే కేసీఆర్‌ రాజకీయంగా ఒంటరయ్యారు: ఈటల

July 20, 2023


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ రాజకీయంగా ఒంటరయ్యారని హుజురాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌ ప్రత్యేక విమానాలు వేసుకొని దేశమంతా తిరిగారు. అనేక పార్టీల నేతలను కలిశారు. అందరికీ తానే నాయకత్వం వహిస్తానని చెప్పుకొన్నారు. అందుకు అంగీకరిస్తే ఆ పార్టీల ఎన్నికల ఖర్చును తానే భరిస్తానని చెప్పారు.

కానీ ఆయనను ఎవరూ నమ్మలేదు. చివరికి తెలంగాణ ప్రజలు కూడా ఆయనను నమ్మడం లేదు. కేసీఆర్‌ తన రాజకీయ దురాశకు తానే బలైపోయారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుదామనుకొన్న కేసీఆర్‌ ఇప్పుడు రాజకీయంగా ఒంటరివారయ్యారు. అందుకే చేతిలో పైసలు, అధికారం ఉన్నాయని ఎప్పుడూ మిడిసిపడకూడదు,” అని ఈటల రాజేందర్‌ అన్నారు. 

కేసీఆర్‌ రాజకీయంగా ఏకాకి కావడానికి ఈటల రాజేందర్‌ చెప్పినదొక్కటే కారణం కాదు. కేసీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలను దూరంగా ఉంచాలనుకోవడం కూడా మరో ప్రధాన కారణం. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిలు అధికారం చేజిక్కించుకోవడానికి కేసీఆర్‌తో పోరాడుతున్నాయి కనుక వాటితో పోరాడుతున్న కారణంగా జాతీయస్థాయిలో వాటితో కలిసి పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయలేకపోవడం వలన ‘ఇండియా’లో చేరలేకపోయారు.  

ఇక తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన్నట్లుగా దేశాన్ని కూడా అభివృధ్ది చేయాలంటే తాను ప్రధానమంత్రి అయితేనే సాధ్యం. అయితే 40-80 లోక్‌సభ సీట్లు ఉన్న మహారాష్ట్ర, యూపీ, బిహార్‌, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలలోని పార్టీలు ప్రధాని అవకాశం తమకే ఉండాలని భావిస్తాయే తప్ప కేవలం 17 లోక్‌సభ సీట్లు మాత్రమే ఉన్న కేసీఆర్‌ ప్రధాని అయ్యేందుకు అంగీకరించవనేది కామన్ సెన్స్. 

ఒకవేళ ప్రతిపక్ష కూటమిలో కేవలం భాగస్వామిగా మాత్రమే కొనసాగేందుకు కేసీఆర్‌ అంగీకరించి ఉండి ఉంటే నేడు రాజకీయంగా ఏకాకి అయ్యేవారు కారు. అయితే ఒంటరి ప్రయాణానికి సిద్దపడే కేసీఆర్‌ ఇందుకు ఆయన సిద్దపడే టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా మార్చుకొన్నారు. కనుక ఆ మార్గంలో ఒంటరిగానే ముందుకు సాగక తప్పదు. 


Related Post