తెలంగాణలో బిజెపి ఎక్కడ?

July 19, 2023


img

నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ అంశంపైనైనా బిఆర్ఎస్-బిజెపిల మద్యే యుద్ధం సాగుతుండేది. ఏ ఎన్నిక జరిగినా బిఆర్ఎస్-బిజెపిల మద్యే యుద్ధం సాగుతుండేది. కాంగ్రెస్ పార్టీ ఊసే వినబడేది కాదు. 

కానీ సిఎం కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్ నేతలు బిజెపిని తమ ప్రత్యర్ధిగా గుర్తించేలా చేసిన వ్యక్తి బండి సంజయ్‌. బిజెపి అధిష్టానం అనూహ్యంగా బండి సంజయ్‌ స్థానంలో కిషన్‌రెడ్డిని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా నియమించినప్పటి నుంచి తెలంగాణలో బిజెపి పూర్తిగా చల్లబడిపోయింది. 

ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందించే విషయంలో బిఆర్ఎస్ దానిపై యుద్ధం ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోరుకొన్నది కూడా ఇదే. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీని గుర్తించని బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ పార్టీని తమ ప్రధాన శత్రువుగా ప్రకటించి యుద్ధం చేస్తుండటంతో, కాంగ్రెస్‌ నేతలు కూడా రంగంలో దిగి ధీటుగా బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటున్నారు.  

వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ వద్దంటున్న కాంగ్రెస్ నేతలను తరిమి కొట్టాలని బిఆర్ఎస్ ప్రజలకు పిలుపునిస్తుంటే, రోజుకి 6-12 గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా చేస్తూ 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని అబద్దాలు చెపుతూ రైతులను మోసగిస్తున్న బిఆర్ఎస్ పార్టీ నేతలనే తరిమికొట్టాలని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు. 

రాష్ట్రంలో వ్యవసాయానికి రోజుకి ఎన్ని గంటలు విద్యుత్‌ సరఫరా అవుతోందో రైతులందరికీ తెలుసని, అయినా ప్రజలందరికీ తెలియజేసేందుకు విద్యుత్‌ కార్యాలయాలలో లాగ్ బుక్స్ లోని వివరాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్‌ నేతలు సవాలు విసురుతున్నారు. వీరి సవాళ్ళకు బిఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పలేక తడబడుతున్నారు. 

రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై బిఆర్ఎస్‌-కాంగ్రెస్ పార్టీల మద్య ఇంత తీవ్రస్థాయిలో యుద్ధాలు జరుగుతుంటే, బిజెపి ప్రేక్షకపాత్రకు పరిమితమైపోయింది. ఈ అంశంపై తన వాదనలను వినిపించే ప్రయత్నం చేయలేదు. గతంలో బిఆర్ఎస్-బిజెపిల పోరాటాలలో కాంగ్రెస్‌ ఏవిదంగా కనబడకుండా పోయేదో, ఇప్పుడు బిఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మద్య జరుగుతున్న ఈ యుద్ధంలో బిజెపి కూడా కనబడకుండా పోయింది. ఈ లెక్కన త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని బిజెపి ఏవిదంగా ఎదుర్కోగలదు?


Related Post