బెంగళూరులో నిన్న, ఇవాళ్ళ జరిగిన బిజెపియేతర పార్టీల సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న 26 పార్టీలు ‘ఇండియా’ (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూసివ్ అలయన్స్) (భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి) అనే పేరుతో కలిసి కట్టుగా పనిచేయాలని నిర్ణయించాయి.ఈ సమావేశం ముగింపు ప్రసంగంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఈ పేరు ప్రకటించారు.
ఈ రెండు రోజుల సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. 1. ఉమ్మడి కార్యక్రమాల రూపకల్పన కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవడం. 2. కూటమికి సంబందించిన అన్ని అంశాలపై భాగస్వామ్య పార్టీలు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకొనేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడం.
ఈ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాని రేసులో నుంచి తాము తప్పుకొంటున్నట్లు ప్రకటించి, మిగిలిన పార్టీలకు ఆదర్శంగా నిలిచింది.
ఈ సమావేశంలో మరో విశేషమేమిటంటే, తెలంగాణ సిఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయాలనుకొన్ననేతలందరూ దీనిలో పాల్గొన్నారు. వారిలో ఢిల్లీ, పంజాబ్, బిహార్, పశ్చిమబెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు అర్వింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, స్టాలిన్, ఇంకా యూపీ, ఝార్ఖండ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్, ఉద్దవ్ థాక్రే, హేమంత్ సొరేన్, మునుగోడు ఉపఎన్నికలలో బిఆర్ఎస్‌తో కలిసి పనిచేసిన వామపక్షపార్టీల జాతీయ కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా తదితరులు ఈ సమావేశంలో పాల్గొని, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈ ‘ఇండియా కూటమి’లో పనిచేసేందుకు అంగీకారం తెలిపారు.
అయితే ఈ కూటమి పేరు ఖరారు చేశారు కానీ ఇంకా ప్రధాని అభ్యర్ధిని ఖరారు చేయవలసి ఉంది. అప్పుడే ఈ కూటమి ఎన్నికల వరకు నిలబడగలదో లేదో, నిలబడగలిగితే బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించగలదో లేదో కూడా తేలిపోతుంది.