సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనే ఆలోచన చేసినప్పుడు మొట్టమొదట బెంగళూరు వెళ్ళి మాజీ ప్రధాని హెచ్‌డి దేవగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామిలతోనే భేటీ అయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా మార్చినప్పుడు కూడా కేసీఆర్ పక్కనే కుమారస్వామి ఉన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కుమారస్వామి (జెడిఎస్)తో కలిసి పోటీ చేస్తామని, ఆయనను ముఖ్యమంత్రి కుర్చీలో కొర్చోబెడతానని కేసీఆర్ చెప్పారు. అయితే ఆ తర్వాత నుంచి కుమారస్వామి హైదరాబాద్ రాలేదు. కేసీఆర్ పక్కన కనపడలేదు. కేసీఆర్ కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్‌ని బరిలో దించలేదు. కనీసం కుమారస్వామికి ‘అవసరమైన సాయం’ అందించలేదు. దీంతో ముఖ్యమంత్రి అవుతారనుకొన్న కుమారస్వామి దెబ్బైపోయారు.
ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పూర్తి మెజార్టీతో గెలవడంతో కుమారస్వామి మద్దతు కూడా అవసరం లేకుండాపోయింది. కనుక ఆయన మళ్ళీ తన రాజకీయ భవిష్యత్ కోసం తన దారి తాను చూసుకొనే ప్రయత్నంలో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన బిజెపికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
నేటి నుంచి బెంగళూరులో కాంగ్రెస్ మిత్రపక్షాల సమావేశాలు జరుగబోతున్నాయి. అయితే వారి కూటమి ఏనాడూ జెడిఎస్ పార్టీని తమలో ఒకరిగా గుర్తించలేదని, కనుక వాటి సమావేశానికి హాజరయ్యే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే రేపు ఢిల్లీలో బిజెపి అధ్వర్యంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశానికి ఆహ్వానం రాలేదని చెప్పారు. ఆహ్వానిస్తే పాల్గొనాలనే ఆసక్తి ఉన్నట్లు మాట్లాడారు. అంటే కేసీఆర్‌తో కలిసి ఏ బిజెపికి వ్యతిరేకంగా పోరాడేందుకు కుమారస్వామి సిద్దమయ్యారో, ఇప్పుడు అదే బిజెపితో దోస్తీకి సిద్దమవుతున్నారన్న మాట!
కేసీఆర్ దోస్తులలో ఆమాద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కూడా మరొకరు. ఆయన ఈరోజు బెంగళూరులో జరిగే కాంగ్రెస్ మిత్రపక్షాల సమావేశానికి హాజరవుతున్నారు.
నేడు బెంగళూరులో జరుగబోయే విపక్ష పార్టీల సమావేశానికి ఆమాద్మీతో సహా మొత్తం 26 బిజెపియేతర పార్టీలు పాల్గొబోతుండగా, రేపు ఢిల్లీలో బిజెపి అధ్వర్యంలో జరుగబోయే ఎన్డీయే సమావేశానికి 30 పార్టీలకు ఆహ్వానం పంపింది. వాటిలో ఏపీ నుంచి టిడిపి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.