రాజాసింగ్‌ బిజెపికి షాక్ ఇస్తారా... బిజెపియే షాక్ ఇస్తుందా?

July 15, 2023


img

ఇటీవల బిజెపి ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెళ్ళి మంత్రి హరీష్‌ రావుతో భేటీ అవడంతో ఆయన బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే బిజెపి హిందుత్వ అజెండాను మరిచిపోయిందేమో కానీ ఆయన హిందూ అతివాదాన్నే అంటిపెట్టుకొని ఉన్నారు. కనుకనే ముస్లింలకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. కనుక ఆయన వంటి హిందూ అతివాదిని స్వయంగా కేసీఆరే ఆహ్వానించినా బిఆర్ఎస్ పార్టీలో చేరరు.

ఆయన బిఆర్ఎస్‌లో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తుంటే, బిజెపి కూడా ఆయనకు షాక్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయకపోగా, ఘోషామహల్ నుంచి బిజెపి అభ్యర్ధిగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్‌ కుమారుడు విక్రమ్ గౌడ్‌కి టికెట్‌ ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. 

ఒకవేళ రాజాసింగ్‌ ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటే జహీరాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని, అందుకు ఆయన అంగీకరిస్తే సస్పెన్షన్ ఎత్తువేస్తామని బిజెపి అధిష్టానం సూచించిన్నట్లు తెలుస్తోంది. అయితే తనకు టికెట్‌ ఇస్తే మళ్ళీ ఘోషామహల్ నుంచే పోటీ చేస్తానని లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకొంటానని రాజాసింగ్ సమాధానం చెప్పిన్నట్లు తెలుస్తోంది. 

ఇది రాజకీయాలలో కొత్త చోటు వెతుకొనే సమయమే తప్ప తప్పుకొనే సమయం కాదు. కనుక ఒకవేళ బిజెపి టికెట్‌ ఇవ్వకపోతే రాజాసింగ్ ఘోషామహల్ నుంచే స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కనుక రాజాసింగ్‌ బిజెపికి షాక్ ఇస్తారా లేక బిజెపియే ఆయనకు షాక్ ఇస్తుందా?అనేది ఎన్నికల గంట మ్రోగితే తేలిపోతుంది.


Related Post