పార్టీలో చేరిన పది రోజులకే పొంగులేటికి కీలక బాధ్యతలు

July 15, 2023


img

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార కమిటీకి సీనియర్ నేత మధూ యాష్కీ గౌడ్‌ని ఛైర్మన్‌గా నియమించి, కో-ఛైర్మన్‌గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. ఆయన సన్నిహితుడు సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీని కన్వీనరుగా నియమించింది. 

అలాగే ఎన్నికల కోసం పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో సహా పార్టీలో సేనియర్లందరితో కలిపి 37 మందితో ఓ కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేసింది. వీటితో బాటు రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలకు అధిష్టానం తరపున 17 మంది పరిశీలకులను కూడా నియమించింది. ఈ నియామకాలన్నీ తక్షణం అమలులోకి వస్తాయని కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. 

కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బిజెపిని ఓడించి ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చాలా ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో ఉంది. పొంగులేటి వంటి పలువురు సీనియర్ నేతలు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో త్వరలో జరుగబోయే ఎన్నికలలో పార్టీకి విజయావకాశాలు ఉన్నాయనే భావన కలుగుతోంది. ప్రజలలో కూడా ఈ భావన కనిపిస్తుండటంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మరింత ఉత్సాహంగా ఉన్నారు. 

అయితే పార్టీలో సీనియర్ నేతలు కీచులాడుకొంటూ, మీడియా ఎదుటకు వచ్చి పరస్పరం విమర్శించుకొంటూ తమ అనైక్యతను చాటుకొంటూ, కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు అపనమ్మకం కలిగేలా చేస్తున్నారు. 

ఇటీవల రేవంత్‌ రెడ్డి ఉచిత విద్యుత్‌ గురించి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ రేవంత్‌ రెడ్డిని, తమ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంటే ఎవరూ రేవంత్‌ రెడ్డిని గట్టిగా సమర్ధించలేదు. బిఆర్ఎస్‌ను గట్టిగా ఎదుర్కొని కాంగ్రెస్‌ వాదనలను బలంగా వినిపించలేదు. కాంగ్రెస్‌ అనైక్యతకు ఇదే తాజా నిదర్శనం. 

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులలో ఈ అనైక్యత, పదవుల కోసం కీచులాటలు సాగుతున్నంతకాలం కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించనక్కరలేదు. వారే తమ పార్టీని ఓడించుకొంటారు. కనుక ముందు ఈ సమస్యను పరిష్కరించుకోవలసి ఉంటుంది లేకుంటే ఎంతమందితో ఎన్ని కమిటీలు వేసుకొన్నా ప్రయోజనం ఉండదు.


Related Post