కాంగ్రెస్‌ విషయంలో బిఆర్ఎస్ తొందరపడిందా?

July 14, 2023


img

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వ్యవసాయానికి రోజుకి 3-8 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తే సరిపోతుందని చేసిన వ్యాఖ్యలపై నిరసనలు తెలుపుతూ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు, ధర్నాలు చేసింది. తద్వారా కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనుకొంది. అయితే ఈ హడావుడిలో తామే స్వయంగా రాష్ట్రంలో మళ్ళీ బలం పుంజుకొందని ప్రజలకు చాటింపు వేస్తున్నామనే విషయం బిఆర్ఎస్ మరిచింది. 

ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిదంగా తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పినప్పుడు, ఇదే బిఆర్ఎస్ నేతలు తేలికగా కొట్టి పడేశారు. ఏదో ఓ రాష్ట్రంలో గెలిస్తే తెలంగాణలో కూడా గెలుస్తామనుకోవడం వెర్రితనం అని వాదించారు. కానీ ఇప్పుడు వారే కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 

బిఆర్ఎస్ పార్టీ తమ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని, తమ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంటే రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ధీటుగా స్పందించకపోవడం కాంగ్రెస్‌లో డొల్లతనాన్ని బయటపెట్టిందని చెపొచ్చు. అది వేరే విషయం. 

నిజానికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా గురించి చాలా మంచి ప్రతిపాదనే చేశారని చెపొచ్చు. ఏ రైతు కూడా 24 గంటలు తన పొలానికి నీళ్ళు పెట్టుకోడు. కనుక రైతులకు అవసరం ఉన్నప్పుడే విద్యుత్‌ ఇస్తే సరిపోతుందని రేవంత్‌ రెడ్డి చెప్పారు. అయితే కేసీఆర్‌ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ సరఫరా పేరుతో వేలకోట్లు అవినీతికి పాల్పడుతోందని, డిస్కంలకు ఉచిత విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోవడంతో అవి నష్టపోతున్నాయని రేవంత్‌ రెడ్డి చెప్పారు. కనుక ఈ ఉచిత విద్యుత్‌ పేరుతో జరిగే అవినీతిని, అదనపు భారాన్ని తగ్గించుకొంటే మంచిదనే ఉద్దేశ్యంతో రేవంత్‌ రెడ్డి చాలా నిర్మాణాత్మకమైన ప్రతిపాదన చేశారు.

ప్రతిపక్షాలు పనికిమాలిన చిల్లర రాజకీయాలు చేయకుండా నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు చేయాలని సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తరచూ చెపుతుంటారు. కానీ రేవంత్‌ రెడ్డి నిర్మాణాత్మకమైన సలహా ఇస్తే, దానిపై బిఆర్ఎస్ పార్టీయే ఈవిదంగా చిల్లర రాజకీయాలు చేస్తుండటం విస్మయం కలిగిస్తుంది.


Related Post