టిడిపి నేతల కంటే పవన్‌ కళ్యాణ్‌ బెటర్?

July 12, 2023


img

ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అక్కడ రాజకీయాలు చాలా చాలా వేడివేడిగా సాగుతున్నాయి. ఇంతకాలం టిడిపి-వైసీపీల మద్య రాజకీయ ఆధిపత్యపోరు సాగేది. కానీ పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్రతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. 

మొదట ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించిన పవన్‌ కళ్యాణ్‌ రెండోసారి వారాహి యాత్రలో ఎవరూ ఊహించని విదంగా వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడుతుండటంతో ఏపీ రాజకీయాలలో ఊహించని స్థాయిలో ప్రకంపనలు మొదలయ్యాయి. 

జగన్ ప్రభుత్వం ఏపీలో ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున లక్షల మంది వాలంటీర్లను నియమించుకొని ప్రజలపై నిఘా పెడుతోందని పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారు. వాలంటీర్లకు ప్రజాధనంతో నెలకు రూ.5,000 చొప్పున ప్రభుత్వం జీతాలు చెల్లిస్తూ వైసీపీ రాజకీయ అవసరాల కోసం వాడుకొంటోందని, వారితో ప్రజలను బెదిరిస్తోందని ఆరోపించారు. 

అంతేకాదు... వాలంటీర్ల ద్వారా ఏపీలో ఒంటరి మహిళలు, వితంతువులు గుర్తించి వారి సమాచారాన్ని ఆసాంఘీక శక్తులకు అందజేస్తున్నారని, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో వేలమంది మహిళలు అదృశ్యమయ్యారంటూ పవన్‌ కళ్యాణ్‌ తీవ్రమైన ఆరోపణ చేశారు. కొందరు వాలంటీర్లు సంక్షేమ పధకాలను నిలిపివేయిస్తామని బెదిరిస్తూ ఒంటరి మహిళలను లొంగదీసుకొంటున్నారని ఆరోపించారు. 

ఎర్రచందనం, మద్యం అక్రమరవాణాలో, కొన్ని దొంగతనం, దారి దోపిడీ, అత్యాచారాల కేసులలో వాలంటీర్లు పట్టుబడ్డారని పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారు. ఏపీ ప్రజల పూర్తి వ్యక్తిగత సమాచారం అంతా హైదరాబాద్‌లో నానక్ రామ్ గూడాలోని ఓ ప్రైవేట్ ఏజన్సీ చేతిలో ఉందంటూ మరో తీవ్రమైన ఆరోపణ చేశారు. ఆ ఏజన్సీలో 700 మంది పనిచేస్తున్నారని వారందరికీ జగన్ ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోందని ఆరోపించారు. 

పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న ఈ ఆరోపణలన్నీ చాలా తీవ్రమైనవే అని అర్దమవుతూనే ఉంది. వాటికి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని త్వరలో వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ కూడా వేస్తామని అన్నారు. 

పవన్‌ కళ్యాణ్‌తో పోలిస్తే చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలందరూ రాజకీయాలలో చాలా సీనియర్లే. కానీ వారిలో ఏ ఒక్కరూ ధైర్యంగా వాలంటీర్ల వ్యవస్థ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలను, అకృత్యాలను ధైర్యంగా బయటపెట్టి జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. 

కానీ పవన్‌ కళ్యాణ్‌ జగన్ ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నిస్తూ ప్రజల దృష్టిలో దోషిగా నిలబెడుతున్నారు. దీంతో ఏపీలో టిడిపి వెనకబడిపోయి జనసేన దూసుకుపోతోంది. అయితే పవన్‌ కళ్యాణ్‌ ఎంతకాలం ఈ స్పీడ్ మెయిన్‌టెయిన్ చేస్తారో... జనసేనని ఈసారి ఎంత దూరం తీసుకువెళతారో చూడాల్సిందే.


Related Post