అమెరికా పర్యటనలో ఉన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా అవసరం లేదు 8 గంటలు చాలని చెప్పిన మాటను పట్టుకొని బిఆర్ఎస్ పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తూ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ చాలా హడావుడి చేస్తున్నాయి.
అయితే ఈ అంశంపై రేవంత్ రెడ్డి చెప్పిన మాటలలో బిఆర్ఎస్ పార్టీ తనకు కావలసిన పాయింట్ మాత్రమే తీసుకొని కాంగ్రెస్ పార్టీపై యుద్ధం ప్రకటించేసింది. బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు.
కేసీఆర్ 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టుతో మూడు పంటలకు సరిపడా సాగునీరు అందించి రైతులకు ఎంతో మేలు చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి వస్తే ధరణీ పోర్టల్ రద్దు చేస్తామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ నిలిపివేస్తామని చెపుతున్నారని, ఇటువంటి నేతలు, పార్టీ తెలంగాణకు అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
చిరకాలం దేశాన్ని సమైక్య రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ వలన దేశంలో వ్యవసాయరంగం తీవ్రంగా నష్టపోయిందని, మళ్ళీ వస్తే ఇంతకాలంగా తెలంగాణలో జరిగిన అభివృద్ధి నిలిచిపోతుందని, రైతులకు మళ్ళీ కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు మొదలైపోతాయని బిఆర్ఎస్ నేతలు నేడు ధర్నాలలో గట్టిగా వాదిస్తున్నారు.
కనుక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని చెపుతున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు వస్తే తరిమికొట్టాలని బిఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
కర్ణాటక ఎన్నికల తర్వాత హటాత్తుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకొంది. కనుక కాంగ్రెస్ పార్టీని ఏవిదంగా ఎదుర్కొని కట్టడి చేయాలా.. అని చూస్తున్న బిఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి అన్న మాట పట్టుకొని అల్లుకుపోయింది.
అయితే బిఆర్ఎస్ ధర్నాల వలన కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతోందని తెలిసి ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎవరూ పెద్దగా స్పందించలేదు. వారందరూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.