తెలంగాణ బిజెపిని గెలుపు ముంగిటకు తెచ్చి నిలబెట్టిన బండి సంజయ్‌ని, బిజెపి అధిష్టానం ఆ పదవిలో నుంచి తప్పించేసి కూర్చొన్న కొమ్మను నర్రుకొంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కూడా అచ్చం అలాగే వ్యవహరిస్తోంది.
కేసీఆర్ నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి మళ్ళీ జీవం పోసి గెలుపు ముంగిటకు తీసుకువస్తుంటే, పార్టీలో సీనియర్లు నేటికీ ఆయన నాయకత్వాన్ని అంగీకరించడంలేదు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడం గురించి అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ధర్నాలు నిర్వహిస్తుంటే, ఆయన వాదనను బలపరిచి తమ పార్టీని కాపాడుకోవలసిన సీనియర్లు నిమ్మకు నీరేత్తిన్నట్లు చూస్తూ ఊరుకొంటున్నారు. తద్వారా రేవంత్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకొన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పిసిసి అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవుల కోసం, పార్టీ టికెట్ల కోసం పోటీ పడే సీనియర్ కాంగ్రెస్ నేతలు, నేడు బిఆర్ఎస్ చేపడుతున్న నిరసనల వలన తమ పార్టీ గురించి ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళి చాలా నష్టం జరుగుతుందని తెలిసి ఉన్నా ఎవరూ స్పందించడం లేదు.
దీంతో మళ్ళీ రేవంత్ రెడ్డే పూనుకొని, “బిజెపికి బిఆర్ఎస్ బీ టీమ్ అని మరోసారి నిరూపించుకొంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తప్పుపడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు చేస్తుంటే వాటిని నీరుగార్చేందుకే బిఆర్ఎస్ ఉచిత విద్యుత్ అంశంపైకి ప్రజల దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తోందంటూ” ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో బిజెపి పుంజుకొని ఎన్నికలకు సిద్దమవుతున్నప్పుడు బండి సంజయ్‌ని మార్చేసి ఆ పార్టీ తనను తానే దెబ్బ తీసుకోగా, కాంగ్రెస్ సీనియర్ నేతలు అనైక్యతతో తమ పార్టీని దెబ్బ తీసుకొంటున్నారు. పార్టీ కంటే తమ ఆహాలు, విభేధాలు, పదవులే ముఖ్యమనుకొనే నేతలున్నప్పుడు ఏ పార్టీ అయినా ఎలా రాణిస్తుంది?తమ నాయకుడిని తామే నమ్మని పార్టీని ప్రజలు మాత్రం ఎందుకు నమ్ముతారు?