ఎన్నికలొస్తున్నాయ్...పాతబస్తీకి మెట్రో కూడా!

July 11, 2023


img

తెలంగాణ ప్రభుత్వాన్ని అభివృద్ధి విషయంలో ఎవరూ తప్పు పట్టలేరు. ఎన్నికలతో సంబంధం లేకుండా గత 9 ఏళ్లుగా రాష్ట్రంలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూనే ఉంది. అయితే హైదరాబాద్‌ పాతబస్తీ మెట్రోకి మాత్రం ఈ సూత్రం వర్తించదనే చెప్పాలి. 

శాసనసభ సమావేశాలలో పాతబస్తీకి మెట్రో రైలు ఎందుకు వేయరని మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశ్నిస్తుంటారు. కానీ పాతబస్తీలో మెట్రో కారిడార్ ఏర్పాటుకి మజ్లీస్‌ పార్టీ సహకరించదు! ఎందుకంటే అక్కడ కిక్కిరిసిపోయున్న అనేక భవనాలను, చారిత్రిక కట్టడాలను, దుకాణాలను, మసీదులను తొలగించవలసి వస్తుంది కనుక! కానీ ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయి. కనుక మజ్లీస్‌, బిఆర్ఎస్ రెండు పార్టీలకి కూడా పాతబస్తీలో మెట్రో రైల్ గుర్తొచ్చింది! 

‘ఎమ్జీబీఎస్-ఫలక్‌నుమాల మార్గంలో 5.5 కిమీ మెట్రో కారిడార్ నిర్మాణ పనులుచేపట్టాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారని’ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

హైదరాబాద్‌లో మిగిలిన అన్ని ప్రాంతాలలో కలిపి ఎల్ అండ్ టి కంపెనీ 69.2 కిమీ మెట్రో కారిడార్ నిర్మించగలిగింది. కానీ ఈ ఒక్క మార్గంలో పాతబస్తీ మీదుగా 5.5 కిమీ ఏర్పాటు చేయలేక చేతులెత్తేసింది. మజ్లీస్ నేతల ఒత్తిడి మేరకు అక్కడి కట్టడాలకు నష్టం కలగకుండా మెట్రో కారిడార్ అలైన్మెంట్ మార్చేందుకు సిద్దపడినా పూర్తిచేయలేకపోయింది. కనుక మజ్లీస్‌ సహకారం లేకపోవడం వలననే పాతబస్తీ వాసులకు మెట్రో సౌకర్యానికి నోచుకోవడంలేదని అర్దమవుతోంది. 

అయితే త్వరలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కనుక పాతబస్తీ ఓటర్లను మభ్యపెట్టేందుకు ‘మెట్రో పాట’ మొదలుపెట్టిన్నట్లు భావించవచ్చు. ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు పాతబస్తీలో దుకాణాలు, భవనాలు, మసీదులు తొలగించే ప్రయత్నం చేస్తే ముందుగా నష్టపోయేది మజ్లీస్‌ పార్టీయే అని వేరే చెప్పక్కరలేదు.

కనుక ఆ పనిచేయనీయదు. అది చేయకుండా మెట్రో కారిడార్ నిర్మాణం జరుగదు. కానీ జరుగుతుందని, మొదలుపెట్టేస్తున్నామని చెపుతూ ఎన్నికలు కానిచ్చేస్తుంది. అంతే! ఒకవేళ నిజంగానే బిఆర్ఎస్‌, మజ్లీస్ పార్టీలు కలిసి పాతబస్తీలో మెట్రో ఏర్పాటు చేసేస్తే సంతోషమే!


Related Post