కాంగ్రెస్‌లో మళ్ళీ కుస్తీపోటీలు షురూ

July 11, 2023


img

తానా మహాసభలలో పాల్గొనేందుకు అమెరికా వెళ్ళిన పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అక్కడ చేసిన వ్యాఖ్యలు, ఇక్కడ తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీలో మంటలు రేపుతున్నాయి. 

వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ అవసరం లేదని, దాని వలన విద్యుత్‌ సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడి రైతుల మోటర్లు, ట్రాన్స్‌ఫార్మార్లు కాలిపోతున్నాయని అన్నారు. కనుక రైతులకు అవసరమైనప్పుడు 8 గంటలు ఉచిత విద్యుత్‌ అందిస్తే చాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, దళిత మహిళ సీతక్క కావచ్చని అన్నారు. 

ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్‌ పుంజుకోవడంతో దానిని గట్టిగా ఢీకొంటున్న బిఆర్ఎస్ పార్టీ, వెంటనే రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను అందిపుచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని, రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని పిలుపు ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తానని, ఇప్పుడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ నిలిపివేస్తామని చెపుతోందని కనుక తెలంగాణకు కాంగ్రెస్‌ ప్రధమ శత్రువు అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. 

“ఆయన ఏ ఉద్దేశ్యంతో ఆ మాటలన్నారో కానీ అవి మా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోకి వ్యతిరేకంగా ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలనే ప్రతిపాదన తెచ్చి అమలుచేసిందే కాంగ్రెస్‌ పార్టీ. కనుక వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ సరఫరాకు మేము కట్టుబడి ఉంటాము. రేవంత్‌ రెడ్డి అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తారు,”అని అన్నారు. 

సీతక్క ముఖ్యమంత్రి అవుతారనడం ‘పెద్ద జోక్’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పార్టీ గెలిచిన తర్వాత మా అధిష్టానం ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకొని అందుకు అనుగుణంగా శాసనసభాపక్ష నాయకుడిని ఎంపిక చేస్తుంది. లేదా మేమే రహస్య బ్యాలెట్ ద్వారా మా నాయకుడిని ఎన్నుకొంటాము. మేము కూడా దళితులు లేదా బీసీ వర్గానికి చెందినవారు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరుకొంటాము. అయితే ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది తేల్చాల్సింది పిసిసి అధ్యక్షుడు కాదు. దానికో పద్దతి ఉంది,” అని అన్నారు. 

కాంగ్రెస్‌ నేతలు ఈవిదంగా పరస్పరం వ్యతిరేకించుకొంటూ మీడియా ముందుకు వచ్చి విమర్శించుకొంటుంటారు గనుకనే వారిపై ప్రజలకు నమ్మకం కలుగదు. కర్ణాటకలో కాంగ్రెస్‌ నేతలు తమ విభేధాలను పక్కన పెట్టి కలిసి పనిచేశారు కనుకనే అక్కడ కాంగ్రెస్‌ గెలువగలిగింది. అని తెలిసినా తెలంగాణ కాంగ్రెస్‌ నేతల తీరు మారకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.


Related Post