ఇటీవల ఖమ్మం రాజకీయాలలో జరిగిన మార్పులతో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అప్రమత్తమైనట్లున్నారు. తన ‘పువ్వాడ ఫౌండేషన్’ ద్వారా ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో 18 ఏళ్ళు నిండినవారందరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పిస్తానని ప్రకటించారు.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం అయ్యే ఖర్చును తన ఫౌండేషన్ భరిస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 23వరకు అంటే సుమారు మూడు నెలల పాటు ఈ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తామని, కనుక అర్హులైనవారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మొన్నటివరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలోనే ఉండేవారు. కానీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మం, కొత్తగూడెం రెండు జిల్లాలలోని అన్ని నియోజకవర్గాలలో ఆయనకు మంచిపట్టుందని తెలిసిందే. పైగా ఈ రెండు జిల్లాలలో కాంగ్రెస్ మొదటినుంచి బలంగానే ఉంది. ఇప్పుడు పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడంతో ఇంకా బలపడింది.
వచ్చే ఎన్నికలలో ఈ రెండు జిల్లాలలో బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకొనీయనని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శపధం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడంతో ఈ రెండు జిల్లాలలో కాంగ్రెస్, బిఆర్ఎస్ బలాబలాలో మార్పు వస్తుంది.
కనుక ఖమ్మంకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అప్రమత్తమైనట్లున్నారు. అందుకే ‘ఓటు హక్కు కలిగిన యువత’ను ఈవిదంగా ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లున్నారు. ఆయన ఎలాగూ రవాణాశాఖ మంత్రి కనుక తన నియోజకవర్గం యువతకు డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించడం ఎడమచేతి చిటికెన వేలుతో చేయగలరు. అయితే ఇదో చిన్న ప్రయత్నం మాత్రమే!
ప్రతీకారంతో రగిలిపోతున్న పొంగులేటి బిఆర్ఎస్‌ని దెబ్బ తీసేందుకు గట్టి ప్రయత్నాలు చేయవచ్చు. అయితే మంత్రి పువ్వాడ కూడా ఆయనకు సమఉజ్జీయే. కనుక వారిద్దరి మద్య అసలు యుద్ధం ఏవిదంగా ఉంటుందో ఎన్నికలలో చూడగలుగుతాము.