ఇటీవల బిజెపి అధిష్టానం వివిద రాష్ట్రాల బిజెపి అధ్యక్షులను మార్చింది. వారిలో తెలంగాణ, ఏపీ బిజెపి అధ్యక్షులు కూడా ఉన్నారు. ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజుని మార్చడం సరైన నిర్ణయమే అని అందరూ భావిస్తున్నారు. కానీ తెలంగాణలో బిజెపికి జీవం పోసిన బండి సంజయ్‌ని సరిగ్గా శాసనసభ ఎన్నికలకు ముందు ఆ పదవిలో నుంచి తొలగించడం బిజెపి చారిత్రిక తప్పిదాలలో ఒకటిగా నిలిచిపోతుంది. ఇది శాసనసభ ఎన్నికల తర్వాత రుజువు కావచ్చు.
బండి సంజయ్, సోమూ వీర్రాజుతో సహా 10 రాష్ట్రాలలో అధ్యక్ష పదవులలో నుంచి తొలగించిన వారిని బిజెపి అధిష్టానం జాతీయ కార్యవర్గంలోకి తీసుకొంది. వీరితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (తెలంగాణ), ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు విష్ణుదేవ్ సాయి, ధరమ్ లాల్ కౌశిక్, కిరోదీలాల్ మీనాలను కూడా బిజెపి జాతీయ కార్యవర్గంలోకి తీసుకొంది.
మిగిలినవారి సంగతెలా ఉన్నా బండి సంజయ్ ప్రజల మద్య ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. కానీ ఆయనను జాతీయ కార్యవర్గంలో కూర్చోబెట్టింది. అక్కడ ఆయన ఏమి చేస్తారో తెలీదు కానీ ఇదివరకు వెంకయ్య నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉంటూ వారికి సహకరిస్తుండటంతో అది నచ్చని బిజెపి అధిష్టానం ఆయనను ఉపరాష్ట్రపతి కుర్చీలో కూర్చోపెట్టి చేతులు, కాళ్ళు, నోరు అన్నీ కట్టేసినట్లే ఇప్పుడు బండి సంజయ్‌ని కూడా కట్టడి చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏపీకి ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరిని, తెలంగాణ బిజెపికి అధ్యక్షులుగా కిషన్‌రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.