త్వరలో ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,హరీష్ రావు, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ఈ అంశంపై సుదీర్గంగా చర్చించిన తర్వాత త్వరలో టెట్ నిర్వహించాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా 2016లో ఆ తర్వాత 2017, 2022లో టెట్ నిర్వహించింది. దానిలో అర్హత సాధిస్తే ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించవచ్చని లక్షలమంది ఆ పరీక్ష వ్రాసి అర్హత సాధించారు. కానీ ఇంతవరకు రాష్ట్రంలో ఉపాధ్యాయుల భర్తీ చేపట్టకపోవడంతో 2016లో టెట్ వ్రాసి అర్హత సాధించినవారు కూడా ఇంకా ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో 22 వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ ఉన్నాయని గతంలో విద్యాశాఖ అంచనా వేయగా 12 వేలే ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ ఆ 12 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టి ఉంటే 2016 నుంచి టెట్ వ్రాసి ఎదురు చూస్తున్నవారికి న్యాయం చేసిన్నట్లు ఉండేది.
కానీ ముందుగా పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముగించాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెపుతుండటంతో 12 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదు. మరోపక్క తగినంత మంది ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నష్టపోతున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్నవారి వయోపరిమితి దాటి పోతుండటంతో వారు కూడా తీవ్ర నిరాశా నిస్పృహలలో ఉన్నారు.
శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మద్యేమార్గంగా మరోసారి టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఎన్నికలకు ముందు టెట్ పరీక్షలు నిర్వహించడం నిరుద్యోగులను మభ్యపెట్టడానికే కదా?అని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా?