ఈరోజు ఉదయం హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నపుడు హటాత్తుగా మంటలు ఎగిసిపడి ఆరు బోగీలు తగలబడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వెంటనే రైలు నిలిపివేయడంతో ఈ ఘోర అగ్నిప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
ఇది చాలా ఊరట కలిగించే విషయమే అయినా ఇప్పుడు మరో విషయం కలకలం సృష్టిస్తోంది. సరిగ్గా వారం రోజుల క్రితం ఓ అజ్ఞాతవ్యక్తి నించి సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజరుకి ఓ ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది.
దానిలో ఇటీవల ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం వంటి మరో ప్రమాదం హైదరాబాద్-ఢిల్లీ-హైదరాబాద్ మార్గంలో మరో వారం రోజులలో జరుగబోతోందనే రహస్య సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాని ఆ అజ్ఞాతవ్యక్తి ఇంగ్లీషులో వ్రాశాడు.
అయితే ఆ లేఖను ఎవరో ఆకతాయి పని అని భావించి రైల్వే అధికారులు పట్టించుకోలేదు. అతను చెప్పిన్నట్లుగా ఢిల్లీ-హైదరాబాద్ రైల్లో కాకపోయినా హౌరా-హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే రైలులోనే సరిగ్గా వారం రోజుల తర్వాతే ఈ అగ్నిప్రమాదం జరిగింది.
దీంతో ఇప్పుడు ఆ లేఖ వ్రాసిన అజ్ఞాతవ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను ఏదో ఆకతాయితనంతో ఆ లేఖ వ్రాస్తే యాదృచ్ఛికంగా అది నిజమైందా లేక అతనికి నిజంగానే సమాచారం లభించి ఈ లేఖ ద్వారా ముందే హెచ్చరించాడా?అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మొదట రైల్వే సిబ్బంది లోకో పైలట్‌ని హెచ్చరిస్తే రైలు నిలిపిన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఫలక్‌నుమా ప్రయాణికులలో ఓ వ్యక్తి చెయిన్ లాగి ట్రెయిన్ నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిన్నట్లు రైల్వే అధికారులు ధృవీకరించారు.
ఈ అగ్నిప్రమాదానికి ఓ ప్రయాణికుడు సిగరెట్ కాల్చడమా లేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం వలనా లేక నిజంగా ఎవరైనా ఈ కుట్రకు పాల్పడ్డారా?అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలవలసి ఉంది.