నోరు జారినందుకు రెండేళ్ళు జైలు శిక్షా?

July 07, 2023


img

కాంగ్రెస్‌ యువరాజు 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు కర్ణాటకలోని కోలార్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, “దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుందో” అంటూ వ్యంగ్యంగా అన్నారు. అయితే ఆ చిన్న మాటే ఆయన మెడకు చుట్టుకొంది. 

సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ళు జైలు శిక్ష విధించడంతో, ఆ తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసి ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. దిగువ కోర్టు తీర్పుని సాకుగా చూపి రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. కానీ కేంద్రం మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదు. 

ఈలోగా రాహుల్ గాంధీ సూరత్ కోర్టు తీర్పుని సవాలు చేస్తూ గుజరాత్‌ హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు కూడా దిగువ కోర్టు తీర్పును సమర్ధిస్తూ తీర్పు చెప్పడంతో రాహుల్ గాంధీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఇక రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుని ఆశ్రయించకతప్పదు. 

ఒకవేళ సుప్రీంకోర్టు కూడా తిరస్కరిస్తే రాహుల్ గాంధీ ఇక వచ్చే ఎన్నికలలో పోటీ చేయలేరు. జైలుకి వెళ్ళకతప్పదు. అయితే రాహుల్ గాంధీని ఎన్నికలకు ముందు జైలుకి పంపితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దానిని హైలైట్ చేసి సానుభూతి పొందేందుకు ప్రయత్నించవచ్చు. అదే జరిగితే ఏ కేసుతో రాహుల్ గాంధీని దెబ్బ తీయాలని బిజెపి భావించిందో అదే కేసుతో బిజెపి అధికారం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కనుక సుప్రీంకోర్టు మందలింపుతో సరిపెట్టి ఆయనపై అనర్హతను ఎత్తివేయవచ్చు. 

అయితే హత్యలు, అత్యాచారాలు, తీవ్రమైన ఆర్ధిక నేరాలు, ఇంకా అనేక రకాల నేరాలు చేసినవారు దర్జాగా చట్టసభలలో సభ్యులుగా, మంత్రులు, ముఖ్యమంత్రులుగా కూడా కొనసాగుతుండగా, రాహుల్ గాంధీ కేవలం నోరు జారినందుకు జైలుకి పంపించాలనుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. 

బిజెపి ఎంపీ తమ పట్ల అసభ్యంగా వ్యవహరించారంటూ మహిళా రెజ్లర్లు ఢిల్లీ నడిబొడ్డున ఆందోళన చేసిన స్పందించని కేంద్ర ప్రభుత్వం, రాహుల్ గాంధీ నోరు జారితే అనర్హత వేటు వేయడాన్ని ఏవిదంగా సమర్ధించుకోగలదు? 


Related Post