తెలంగాణలో ముందుగా ఎన్నికలు జరుగబోతుంటే తెలంగాణతో పాటు ఏపీలో కూడా శరవేగంగా రాజకీయాలు పరిణామాలు జరుగుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరిని నియమించడంతో ఏపీ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇంతకాలం అధ్యక్షుడుగా ఉన్న సోమూ వీర్రాజు జగన్ ప్రభుత్వం పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపధ్యంలో ఆయనని తొలగించి దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగించింది.
అయితే ఆమె, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బంధువులే అయినప్పటికీ వారి మద్య విభేధాలు ఉన్న సంగతి తెలిసిందే. కనుక పురందేశ్వరి నియామకంతో టిడిపిని దూరంగా ఉంచబోతున్నట్లు బిజెపి సంకేతాలు ఇచ్చిన్నట్లయింది. కానీ ఆమె నియామకం జరిగిన మర్నాడే బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమిలోకి మళ్ళీ టిడిపిని చేర్చుకోబోతున్నట్లు మరో సంకేతం పంపింది.
ఈ నెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో బిజెపి మిత్రపక్షాలు సమావేశం కానున్నాయి. టిడిపి ఎన్డీయేలో ఒకప్పుడు భాగస్వామిగా ఉండేది కానీ తర్వాత మోదీతో విభేదించి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ మోడీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నించారు కానీ ఇంతకాలం ఆయనను దూరం పెట్టారు. ఇప్పుడు బిజెపి స్వయంగా ఎన్డీయే సమావేశంలో పాల్గొనవలసిందిగా టిడిపికి ఆహ్వానం పంపడంతో మళ్ళీ టిడిపితో కలిసి పనిచేసేందుకు బిజెపి సిద్దమని చెప్పకనే చెప్పింది.
టిడిపి మళ్ళీ ఎన్డీయేలో చేరిన్నట్లయితే, తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు టిడిపి అన్ని విదాలా సహాయపడుతుందని వేరేగా చెప్పక్కరలేదు. ఇందుకు ప్రతిగా ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చేందుకు కేంద్రం అవసరమైన సహాయ సహకారాలు అందించడం ఖాయం. కనుక ఎన్డీయేలో టిడిపి చేరిక రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చాలా ప్రభావం చూపడం ఖాయమనే భావించవచ్చు.