హమ్మయ్య... రాజగోపాల్ రెడ్డికి పదవి దక్కింది మరి రఘునందన్ సంగతి?

July 05, 2023


img

కాంగ్రెస్‌ పార్టీలో నుంచి పెద్ద పెద్ద ఆశలు, కలలతో బిజెపిలోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ఉపఎన్నికలలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బలం, బలగంపై చాలా నమ్మకం పెట్టుకొని ఉపఎన్నికలు తెచ్చిపెట్టుకొన్న బిజెపి అధిష్టానం కూడా ఆయన వలన తల దించుకోవలసి వచ్చింది. అయితే ఇది జరిగిపోయిన చరిత్ర.

బండి సంజయ్‌కి పొగ పెట్టి హైదరాబాద్‌కు దూరంగా ఢిల్లీకి పంపించడంలో తలో చెయ్యి వేసినవారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఒకరని గుసగుసలు వినిపించాయి. అయితే బండిని బయటకు పంపితే ఆ కుర్చీలో తనకు దక్కుతుందనుకొంటే, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా కిషన్‌రెడ్డిని నియమించి బిజెపి అధిష్టానం షాక్ ఇచ్చింది. దాంతో ఆయన ఆలస్యం చేయకుండా పొంగులేటితో టచ్చులోకి వెళ్ళారనే వార్తలు లీక్ చేశారు.

అప్పుడు బిజెపి అధిష్టానం కూడా అప్రమత్తమయ్యి ఆయనకు బిజెపి జాతీయ కార్యవర్గంలో సభ్యుడుగా నియమించి చేతులు దులుపుకొంది. ఈ మేరకు బిజెపి జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ఈరోజు సాయంత్రం ఓ లేఖ విడుదల చేశారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఢిల్లీలో, ఈటల రాజేందర్‌కు తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు సరే మరి నా సంగతేమిటి? అని ప్రశ్నిస్తున్న దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు సంగతి కూడా చూడాల్సి ఉంది. తాను కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని ఆయన చెప్పారు. కనుక ఏదో చిన్నా చితకా పదవి ఇస్తే ఆయన అలకపాన్పు దిగకపోవచ్చు. మరి బిజెపి అధిష్టానం ఆయనకు ఏ పదవి ఇస్తుందో చూడాలి.



Related Post