కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి?

July 05, 2023


img

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి చేరుకోవాలని అనుకొంటున్నారా?అంటే అవుననే అనిపిస్తోంది. గమ్మతైన విషయం ఏమిటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో చేరితే ఏవో పదవులు లభిస్తాయనుకొంటే ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా ఊడగొట్టున్నారు. 

సరే... బండి సంజయ్‌ నేతృత్వంలో తెలంగాణలో బిజెపి దూసుకుపోతోంది గనుక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పదవులు లభిస్తాయనుకొంటే, రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్‌, రఘునందన్ రావు వంటి కొందరు నేతలు కలిసి ఆయనకు పొగబెట్టి కుర్చీలో నుంచి దింపేశారు. దీంతో వారే స్వయంగా ఆ దారి మూసేసుకొన్నట్లయింది. 

బండికి బ్రేకులు వేసి పంపించేశాము కనుక తమలో ఎవరో ఒకరికి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పదవి లభిస్తుందనుకొంటే కిషన్‌రెడ్డికి పగ్గాలు అప్పగించడంతో అందరూ కంగు తిన్నారు. 

ఈటల రాజేందర్‌కు కనీసం ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ పదవి లభించింది. కానీ రాజగోపాల్ రెడ్డి, రఘునందన్ రావులకు ఏ పదవీ లభించలేదు.

ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ని తప్పించడానికి నేతల పిర్యాదులే కారణంగా చూపిస్తున్నప్పటికీ, కాంగ్రెస్‌ నేతలు మాత్రం బిఆర్ఎస్‌ని మళ్ళీ గెలిపించేందుకే అని వాదిస్తున్నారు. కాంగ్రెస్‌ వాదనలతో, బిజెపి విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారుతోంది.  

ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు చేజేతులా పార్టీలో ఇటువంటి అయోమయ పరిస్థితులు సృష్టించుకోవడంతో మునిగిపోయే బిజెపి నౌకలో నుంచి బయటకు దూకెసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిద్దం అవుతున్నారు. 

మరో గమ్మతైన విషయం ఏమిటంటే, మొన్నటివరకు కాంగ్రెస్‌, బిజెపి నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు ఆయనతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. 

ఖమ్మం సభలో రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ తలుపులు బార్లా తెరిచామని ప్రకటించారు కనుక, కాంగ్రెస్‌ గూటికి చేరుకోవడానికి ఇదే మంచి సమయమని రాజగోపాల్ రెడ్డికి పొంగులేటి నచ్చజెప్పిన్నట్లు తెలుస్తోంది. కనుక నేడో రేపో ఆయన కూడా కాంగ్రెస్‌ గూటికి చేరుకోవడం ఖాయమే అని భావించవచ్చు.


Related Post