తెలంగాణ బిజెపి నేతల మద్య పదవుల కోసం కుమ్ములాటలు కొనసాగుతుండగానే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని, రాష్ట్ర బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ని నియమిస్తున్నట్లు బిజే అధిష్టానం ప్రకటించేసింది.
పార్టీలో ఎంత పనిచేసినా గుర్తింపు లేదని అసంతృప్తి వ్యక్తం చేసి, పార్టీ అధ్యక్ష పదవి రేసులో నేను కూడా ఉన్నానని రఘునందన్ రావు చెప్పినప్పటికీ ఆయనకు బిజెపి అధిష్టానం ఎటువంటి పదవులు ఇవ్వలేదు. బహుశః త్వరలోనే ఏదో పదవి ఇచ్చి బుజ్జగించవచ్చు. లేకుంటే ఆయన బిజెపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఖాయమే.
అయితే కిషన్‌రెడ్డి- ఈటల రాజేందర్ కాంబినేషన్‌లో తెలంగాణ బిజెపి మళ్ళీ అంతే దూకుడుగా పనిచేసే బదులు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఈయవచ్చు. బండి సంజయ్ కారణంగానే ఇతర పార్టీలలో నుంచి బిజెపిలో చేరేందుకు చాలా మంది వెనకాడుతున్నారని ఈటల రాజేందర్ బిజెపి అధిష్టానానికి చెప్పడం నిజమైతే ఇప్పుడు ఆయన కోరుకొన్నట్లే బండి సంజయ్‌ని తప్పించారు కనుక ఇతర పార్టీలలో నుంచి ఎంతమందిని ఆకర్షించగలరో చూడాలి.
తెలంగాణ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుని మార్చడం చాలా సాహసమనే చెప్పాలి. మరి ఇంత సాహసం చేసినందుకు శాసనసభ ఎన్నికలలో బిజెపి గెలిచి అధికారంలోకి రాగలదా?చూడాలి.