తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఆ పదవి నుంచి తప్పించి కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిని నియమించబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో బిజెపి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో బండి సంజయ్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు.
పార్టీలో మిగిలిన నేతల ఒత్తిడి, పిర్యాదులు కారణంగానే బండి సంజయ్‌ని మార్చబోతున్నారని, ఆయనను మోడీ మంత్రివర్గంలోకి లేదా బిజెపి జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇవి నిజమా కాదా అనేది నేడో రేపో తేలిపోతుంది. ఒకవేళ బండి సంజయ్‌ని మార్చినట్లయితే, అందుకు బిజెపి ఎన్ని కారణాలు చెప్పుకొన్నప్పటికీ, బిజెపి-బిఆర్ఎస్ పార్టీల మద్య లోపాయికారి ఒప్పందం, అనుబందం ఉందనే కాంగ్రెస్ వాదనలకు బలం చేకూర్చినట్లే అవుతుంది.
కాంగ్రెస్ చేస్తున్న ఈ వాదనలతో తెలంగాణలో బిజెపి విశ్వసనీయత దెబ్బ తింటోందని, కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై తక్షణం చర్యలు తీసుకొని బిఆర్ఎస్ పార్టీతో బిజెపికి ఎటువంటి సంబందమూ లేదని ప్రజలకు నిరూపించాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు ఢిల్లీ పెద్దలకు సూచించిన సంగతి తెలిసిందే.
అయితే బిజెపి అధిష్టానం వారి సూచనలు పట్టించుకోకపోగా తెలంగాణలో నిద్రావస్థలో ఉన్న బిజెపిని నిద్రలేపి పరుగులు పెట్టిస్తూ బిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలబెట్టిన బండి సంజయ్‌ని మార్చినట్లయితే కాంగ్రెస్ వాదనలను ధృవీకరించినట్లే అవుతుంది. కానీ కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి బండి సంజయ్‌ని మార్చి తెలంగాణలో పార్టీని ఎందుకు నష్టపరుచుకొంటుంది?అనే ప్రశ్నకు సరైన సమాధానమే ఉంది.
ఈసారి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్, మిత్రపక్షాల నుంచి బిజెపికి గట్టి సవాలు ఎదురవబోతోంది. కనుక కేసీఆర్ ద్వారా ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓట్లు చీల్చి అడ్డుకోగలిగితే, లోక్‌సభ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్‌ని ఎన్డీయే కూటమిలోకి తీసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని బిజెపి అధిష్టానం భావిస్తుండవచ్చు. ఇది నిజమా కాదా అనేది రాబోయే రోజుల్లో క్రమంగా బయటపడుతుంది.