రేపు ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ జరుగబోతోంది. ఈ సభకు ముఖ్య అతిధిగా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ రాబోతున్నారు. ఆయన సమక్షంలోనే పొంగులేటి, జూపల్లి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ఈ సభకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ హాజరుకాబోతున్నారు. కనుక ఈ సభను తన శక్తి ప్రదర్శనకు నిదర్శనంగా సుమారు 5 లక్షల మంది జనసమీకరణ చేసి విజయవంతం చేసేందుకు పొంగులేటి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖమ్మం-వైరా రోడ్డులో ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో 100 ఎకరాలను జేసీబీలు, ట్రాక్టర్లు పెట్టి చదునుచేయించి అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పొంగులేటి అనుచరులందరూ కూడా ఈ బహిరంగసభలో ఏర్పాట్లతో క్షణం తీరికలేకుండా ఉన్నారు.
ఇటువంటి సమయంలో శనివారం ఉదయం ఖమ్మం పట్టణంలో పలు ప్రాంతాలలో పొంగులేటిని, ఆయన అనుచరులను హెచ్చరిస్తూ వెలిసిన పోస్టర్స్ కలకలం సృష్టిస్తున్నాయి.
వాటిలో “మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీని నోటికొచ్చిన్నట్లు విమర్శిస్తే పొంగులేటి అనుచరుల శవాలు కూడా కనబడవు” అంటూ వ్రాసి ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే వాటిని తొలగించి, సిసి కెమెరాల ఆధారంగా వాటిని ఎవరు అంటించారో కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో భూముల ధరలు పెరిగిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగంలో కిడ్నాపులు, హత్యలు జరుగుతున్న వార్తలు వినిపిస్తున్నాయి కానీ తెలంగాణలో ఎన్నడూ ఇటువంటి ‘హత్య రాజకీయాలు’ జరిగిన దాఖలాలు చాలా తక్కువ.
బహుశః మంత్రి అనుచరులు లేదా బిఆర్ఎస్ కార్యకర్తలే ఈ పోస్టర్స్ ద్వారా తమను బెదిరించాలని ప్రయత్నిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అయితే ఇలాంటి బెదిరింపులకి, హత్యా రాజకీయాలకు భయపడనని అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక చివరికి మంత్రి పువ్వాడ ఇలాంటి నీచమైన ఆలోచనలు చేస్తుండటం సిగ్గుచేటని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.